భాషిణివై నాయిడుముల
శోషిణివై సుమధుర చిరసుందర జీవో
న్మేషిణివై నిరతము సం
తోషిణివై మెలగితీవు తోయజనేత్రీ!
యోజితవై; యందరిచే
పూజితవై; సోదరుల కపూర్వగుణ సము
త్తేజితవై; సర్వదిశా
భ్రాజితవై యలరినావు రసమయ చరితా!
సగమగు శతాబ్ద కాలము
సగభాగమవై చరించి సతతము తోడై
నిగనిగలను నిండించిన
మగువా! నను వీడినావ! మరచుచు మైత్రిన్.
రమణి! యిచ్చినావు రత్నత్రయము నాకు;
మురిసిపోతి నెంతొ ముద్దుగొనుచు;
నీదు వదనశోభ నిత్యము కనుగొందు
సుతలలోన మనదు సుతునిలోన.
మధురభాషిణి! వనమను మనములోన
పూచె వన్నెల చిన్నెల పువ్వులివియె;
కమ్రకల్యాణ కాలపు కాన్కయట్టు
లందుకొనుమిక ఆనందమందుకొనుము.