న్యస్తాక్షరులు

 

1.   న్యస్తాక్షరి:  నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శు - క్ర - వా - రం" ఉండాలి.  అంశము- వరలక్ష్మీవ్రతము.  ఛందస్సు- తేటగీతి.

 

 (వాత్స్యల్యామృతవర్షిణి వరలక్ష్మీదేవి.)

శుభ్రవస్త్రపు వేదిక సొబగులొలయ

క్రమ్ముకొనియెడి పరిమళకలన తోడ

వాలుకన్నుల వరలక్ష్మి వత్సలతను

రంజనమ్ముగ బడయంగ రండురండు.

 

2.   న్యస్తాక్షరి:  మొదటి పాదం మొదటి గణం మొదటి అక్షరం 'స్వ' , రెండవ పాదం రెండవ గణం మొదటి అక్షరం 'తం',  మూడవ పాదం మూడవ గణం మొదటి అక్షరం 'త్ర',  నాల్గవ పాదం నాల్గవ గణం మొదటి అక్షరం 'ము'. అంశము- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఛందస్సు- తేటగీతి.

 

 (భరత మాత)

స్వర్గసీమనుబోలెడి స్వర్ణభూమి

పరులతంత్రముబాపిన భాగ్యభూమి

వేదములు విచిత్రమ్ముగ వెలుగుభూమి

మూడురంగుల కేతన ముగ్ధభూమి.

 

3.   న్యస్తాక్షరి:  అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "గు - రు - పూ - జ" ఉండవలెను. అంశము- ఉపాధ్యాయ దినోత్సవము. ఛందస్సు- తేటగీతి.

 

 (ఆచార్యుని స్వరూప స్వభావాలు)

గున్నమామిడి రూపమ్ము; వెన్నమనసు;

రుజలు పోగొట్టు చల్లని రుచిరదృక్కు;

పూజ్యతను పెంచు చక్కని పూతనడత;

జన్మజన్మకు మరువము చదువులయ్య!


4.   న్యస్తాక్షరి:  అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా  "స - ర - స్వ - తి" ఉండవలెను.  అంశము- సరస్వతీ స్తుతి. ఛందస్సు- తేటగీతి.

 

 (సరస్వతీ సాక్షాత్కారం)

సర్వ వాఙ్మయసంపూర్ణసంవిలాస!

రసమయివి నీవు భారతి! రాజితాంఘ్రి!

స్వస్తి కలిగింపరావమ్మ సత్వరమ్ము;

తిమిరసంతతి బాపుము దివ్యవాణి!

 

5.   న్యస్తాక్షరి:  అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "అ - న్న - మ - య్య" ఉండవలెను. అంశము - అన్నమయ్య పదవైభవం. ఛందస్సు- కందంలో.

 

 (పదకవితా పితామహుడు)

అల చందమామ సొగసు,

న్నలినదళేక్షణు మనోజ్ఞనయనపు కాంతుల్,

మలయజపరిమళములు,

య్య! లయించెను నీపదముల నాదర్శకవీ!

 

6.   న్యస్తాక్షరి:  అన్ని పాదాల యతిస్థానాలలో వరుసగా "క్రొ - త్త - సా - లు" ఉండాలి. అంశము - నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఛందస్సు- తేటగీతి.

 

(మా – నవవత్సరం)

గుమ్మపాలను బోలెడి క్రొత్తదారి

ధనికులైనట్టి వారి విత్తమ్ములన్ని

సంఘసౌభాగ్య గతులను సాగుచుండ

లోకమంతట నవినీతి లుప్తమగును.

  

7.   న్యస్తాక్షరి:  అన్ని పాదాల చివరి అక్షరాలు వరుసగా "గ్ర - హ - ణ - ము" ఉండాలి. అంశము - చంద్రగ్రహణము. ఛందస్సు- తేటగీతి.

 

(కొడుకు శశిధర్, కూతురు వీణలతో తండ్రి)

సత్యదృష్టి జూడు శశిధరా! పుత్రాగ్ర!

తెలియుమయ్య చంద్రు దివ్యమోహ!

నూటయేబదేండ్లనూత్నత గను వీణ!

నీలి యెరుపు చంద్రు నిండుదనము.

 

8.   న్యస్తాక్షరి:  అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "శి - వ - రా - త్రి" ఉండాలి. అంశము శివస్తుతి. ఛందస్సు- తేటగీతి.

 

(నమో నమో నటరాజ)

శిరము మీదను శశిరేఖ; చేతిలోన

వహ్ని; గళమందు వాసుకి; జహ్ను కన్య;

రాణి శివకామ సుందరి; రమ్య డమరు;

త్రిణయన! నటరాజ! యభవ! ప్రణతులివియె.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి