విన్నపం

 సహృదయులకు నమస్కారం.

మీ కరకమలాల నలంకరించింది “కదంబమాలిక”. అనేకమయిన రంగురంగుల పూలతో కట్టబడిన మాలికను కదంబమాలిక అంటారు. ఇక్కడ ఈమాలికలో  సాహిత్యానికి సంబంధించిన సమస్యాపూరణలు, దత్తపదులు, న్యస్తాక్షరులు, నిషిద్ధాక్షరులు, ఛందోగోపనములు పొందుపరచబడినాయి.

అమెరికాలో మాఅబ్బాయి శ్రీనాథ్ వద్ద ఉంటున్న నన్ను అంతర్జాలం లోని “శంకరాభరణం” అన్న బ్లాగ్ లోని పద్యాలు ఎంతో ఆకర్షించాయి. ఎన్నెన్నో సాహిత్యానికి సంబంధించిన అంశాలు అందులో దర్శనమిచ్చాయి.

ప్రసిద్ధ కవులు, పండితులు, విమర్శకులు, అధ్యాపకులు అయిన శ్రీ కంది శంకరయ్య గారు శంకరాభరణం సృష్టికర్త. ఆయన ప్రతిరోజూ అనేకమైన అంశాలను గురించి ఒక సమస్యనో, దత్తపదినో, న్యస్తాక్షరినో, నిషిద్ధాక్షరినో, ఛందోగోపనమునో ఇస్తారు. దానికి స్పందించి పిన్నల నుంచి పెద్దల దాక పద్యాలు పంపిస్తూ ఉంటారు. మన దేశం నుంచే కాకుండా విదేశాలలోని తెలుగువారు కూడా ఈ కార్యక్రమములో ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఉద్వేగంతో పాల్గొంటున్నారు.

సాహిత్యంలో పద్యం రమణీయమైనది. బాలకవులకు, యువకవులకు, ప్రౌఢకవులకు, కవయిత్రులకు శంకరాభరణం రచనారంగంలో ఒక దిక్సూచిలాగా మార్గదర్శక మవుతున్నది. ఇది ఎంతో హర్షింప దగిన విషయం.

ప్రస్తుతగ్రంధంలో జూలై 06 వ తేది 2017 నుండి ఫిబ్రవరి 27 వ తేది 2018 వరకు శంకరాభరణంలో నేను వ్రాసిన పద్యాలు చోటుచేసుకున్నాయి. సాహితీపిపాసువులకీ గ్రంధం ఏ కొద్దిపాటి దాహార్తిని తీర్చినా నాప్రయత్నం సఫలమైనట్లే.

విళంబి ఉగాది - మార్చి 18, 2018                           జంధ్యాల జయకృష్ణ బాపూజీ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి