దత్తపదులు

 

1. దత్తపది:  “అర - చెర - ధర - ముర” పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ

భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.


(శరతల్ప గతుడైన భీష్ముడు శ్రీకృష్ణునితో)

అరవిందనయన! కృష్ణా!

చెరలాడితి నీబ్రతుకున చేతోగతితో;

మురళీమోహనరూపా!

గిరిధర! ముక్తుని సలుపుము, కేలున్ మోడ్తున్.

2. దత్తపది:  “రయము - భయము - జయము - నయము” పదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

(యజ్ఞాశ్వాన్ని బంధించిన లవకుశులు)

రయమున నేగుదెంచినది లాలితరీతిని నశ్వమంతటన్;

భయమున కాయముల్ వణక వందురసాగిరి మౌనిబాలకుల్;

జయమును పొందనెంచిన కుశాగ్రమతుల్ లవుడున్ గుశుండునున్

నయముగ బట్టితెచ్చి జవనాశ్వము నుంచిరి బంధనంబునన్.

3. దత్తపది:  “అరిసె - గారె - పూరి - వడ” పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ రామాయణార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

(రావణుని పరాక్రమం – దేవతల పరాజయం)

రావణబ్రహ్మ పూరించు రౌద్రశంఖ

రవము విని మూర్ఛితులు గారె రాజులెల్ల!

గగన మందుండి పడు వడగండ్ల రీతి

అరిసెగలు దాకి సురలును అదరి పడరె!

4. దత్తపది:  “అవ్వ - తాత - అత్త - మామ” పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

(అర్జునుడు ఊర్వశితో)

వనితా! తప్పిది! యొప్పదు;

నిను నత్తను వలనుపడదు; నిర్మలచిత్తం

బున నవ్వలి తెరగరయుము;

కను మామకవిధి లతాంగి! కరుణను జనుమా!

5. దత్తపది:  “కన్ను - ముక్కు - చెవి - నోరు” పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ రామాయణార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

(శ్రీరాముని శివధనుర్భంగం)

వీరరఘువంశతిలకుండు విరచె విల్లు;

శివు డమరు డుముక్కని చెలగి మ్రోగె;

సురలు వీకన్నుతుల తోడ విరుల నిడిరి;

చేతనోరు జానకి కింక సిగ్గు కలిగె.

6. దత్తపది:  “కిక్ - లక్ - చెక్ - నెక్” పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

(పాండవుల వనవాససందర్భం - సుభద్రతో శ్రీకృష్ణుడు)

చివురుచెక్కిళ్ళ కన్నీరు చిందనీకు;

చెల్లి! నీకిక్క డేకీడు చేరదమ్మ!

ఎట్టి యిడుముల కొండైన నెక్కగలిగి

యరుగుదెంతురు పాండవు లక్కజముగ.

 

7. దత్తపది:  “తల - మెడ - కడుపు - వీపు” పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

(నర్తనశాలలో కీచకుడు సైరంధ్రి రూపంలోని భీమునితో )

తలపులెన్నెన్నొ ముసిరెను కలికిమిన్న!

కడు పునీతుడ నయ్యెద గనుము నన్ను;

కాల మెడమైన నోపను కరుణ జూపు;

తగ్గవీ పులకింతలు సిగ్గుపడకె!

 

8. దత్తపది:  “దొర - డబ్బు - అప్పు - వడ్డి”  పదాలను ఉపయోగిస్తూ ఋణగ్రస్తుని బాధను వర్ణిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

 (వేంకటేశ్వరునికి వేదనానివేదన)

దొరకునా స్వామి! వేదన దొరలు దినము?

స్వేచ్ఛ యెపుడబ్బునయ్య యో శ్రీనివాస?

సరసి యప్పుల స్నానము సలిపినాడ;

మదిని శాంతిని వడ్డింపుమయ్య! నాకు.

 

9. దత్తపది:  “ఆట - పాట - బాట మాట” పదాలను ఉపయోగిస్తూ ప్రపంచ తెలుగు మహాసభలను గురించి నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

 (తెలంగాణ ప్రాంగణం – తెలుగుతల్లి వీక్షణం)

పాటలంబైన కాంతులు పరిఢవిల్లె;

బాటమీరని మరియాద బయలువెడలె;

మాటకందని మమతలు మదుల పొంగె;

ఆంధ్రభారతి తెలగాణ నాటలాడ.

  

10. దత్తపది:  “మేరీ - యేసు - సిలువ - చర్చి” పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ

శ్రీకృష్ణుని స్తుతిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

 (యశోదమ్మ గోపకాంతలతో)

పాడియే సుపుత్రుని గూర్చి పలుకనిట్లు?

తప్పు; మీయుల్ల మేరీతి నొప్పుకొనియె?

మంచి భాసిలు వట్టి యమాయకుండు;

చాలులెండమ్మ చర్చింప జాణలార!

 

11. దత్తపది:  “హస్త - చిత్త - స్వాతి - మూల” పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ

షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

 (వధూవరులు స్వాతి – కృష్ణుల బువ్వపుబంతి)

మూలపాత్రను బాయస మొదవజేయ,

చిత్తమలరగ కూరల జెంత నుంప,

హస్తముల బిండివంటలు నందగింప,

స్వాతి- కృష్ణుల బువ్వపుబంతి జరిగె.

 

12. దత్తపది:  “నది - మది - పది - గది” పదాలను ఉపయోగిస్తూ గురుశిష్య సంబంధాన్ని వివరిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

(తిక్కనమహాకవి పినాకినీ నదీతీరంలో శిష్యుడైన గురునాథునితో)

శిష్య! గురునాథ! మననది జేరినాము;

మదికి సంతోష మాయెను; మహితమతివి;

పదిలముగ గంటమును దాళపత్రములను

బట్టి, తెలుగది వ్రాయుము భారతమ్ము.

 

13. దత్తపది:  “నిండుగ - పండుగ - మెండుగ - దండిగ” పదాలను ఉపయోగిస్తూ

అవధాన వైభవాన్ని వివరిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

(అష్టావధాన, శతావధాన, సహస్రావధాన వైభవం)

నిండుగ నష్టపద్యముల నేర్పుగ బల్కును నొక్క పూజ్యుడున్;

పండుగ సల్పు నూరయిన పద్యసుమమ్ముల నొక్క యార్యుడున్;

మెండుగ వేయిపద్యముల మీరును మేధను నొక్క ప్రౌఢుడున్;

దండిగ వాణిపాదముల దక్షత గొల్తురు సత్కవీంద్రులున్.

 

14. దత్తపది:  “కన్ను - చెన్ను - పన్ను - దన్ను” పదాలను ఉపయోగిస్తూ హనుమంతుని వర్ణిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

 (హనుమంతునితో  ఇంద్రజిత్తు)

కన్నులు మూసికొంచు నెటు కాలిని బెట్టితివోరి లంకలో?

చెన్నులు మాసిపోవగను చింతలబాటయె నీకు తధ్యమౌ;

పన్నుగ వానరాధముడ! ప్రాణము దీసెద గాచుకొమ్మికన్

దన్నులు, దోకకాల్పులును దప్పవు నీవిక పాదమంటరా!

 

15. దత్తపది:  “దేశము - కోశము - పాశము - నాశము” పదాలను ఉపయోగిస్తూ

దేశభక్తిని ప్రబోధిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

(సర్వాగ్రగణ్య దేశమాత)

కోశము చక్కజేసికొని కూర్మిగ నందరు గూడియుండగా;

పాశము చుట్టుముట్టి నవభారతమాతకు సేవజేయుచున్;

నాశము నందగా మకిలి నాణ్యత నల్గడ మోసులెత్తగా;

దేశముకంటె మించినది దీక్షగ జూచిన నేదిలేదురా.


16. దత్తపది:  “ఏరు - పారు - ఊరు - మారు” పదాలను ఉపయోగిస్తూ

పల్లీయ సౌందర్యాన్ని వర్ణిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

 

(మన గ్రామం)

ఏరులు నేరులై పడగలెత్తును చుట్టరికంపు పిల్పులున్;

పారును పుష్కలంబుగను బర్వుల దీయుచు వాగువంకలున్;

ఊరును నోటిలో జలము లూరిన పచ్చడు లెంచిచూచినన్;

మారును యంత్రజీవనము మంగళమూర్తిని పల్లె గాంచినన్.


1 కామెంట్‌:

  1. దత్త పది..ఏరు,పారు,ఊరు,మారు

    ఏరు పొంగగా జనులకు ఏల ప్రశ్న
    పారు నీరుపల్లమునకే ప్రకృతి ప్రశ్న
    ఊరు నోరుమంచిదిఐతే ఊరు ప్రశ్న
    మారుమూలన మనవాడు మనసు ప్రశ్న
    మాలిక కదంబ మేనులే మహిమ ప్రశ్న ఈశ్వరా

    రిప్లయితొలగించండి