సమస్యలు

 

1.   సమస్య: “దున్న పాలు పిండ దుత్త దెమ్ము”

 

(భార్యతో భర్త)

మొగము వాచియుంటి మూడేండ్లు జున్నుకై;

ఎఱ్ఱ దూడ నీనె కఱ్ఱి బఱ్ఱె;  

పడతి! వేగరమ్ము; కడవంటి పొదుగు నం

దున్న పాలు పిండ దుత్త దెమ్ము.

 

2. సమస్య: “మద్యమె బలవర్ధకమ్ము మనుజుల కెల్లన్”

 

(కవి మద్యంమాని పద్యంవ్రాస్తే సమాజానికి బలం)

హృద్యమ్మగు పద్యమ్ముల

సద్యశము గడించుచు దగ సారస్వతనై

వేద్యము నిచ్చు కవి విడగ

మద్యమె; బలవర్ధకమ్ము మనుజుల కెల్లన్.

 

3. సమస్య: “శుకయోగికి నల్లుడయ్యె సురనది కొడుకే”

 

(గురువు ప్రశ్నలు – శిష్యుని సమాధానాలు)

“సుకవియగు వ్యాసు డెవ్వా

నికి తండ్రి? రాముడు జనకునికి నేమగునో?

అకళంకుండగు భీష్ముడొ?

“శుకయోగికి; నల్లుడయ్యె; సురనది కొడుకే.”

 

4. సమస్య: “అష్టమితిథి శుభకరమని యందురు విజ్ఞుల్”

 

(దుర్గాష్టమితిథి లోకశుభంకరం)

కష్టము బాపగ జనులకు

నష్టభుజమ్ముల మహోజ్జ్వలాయుధతతితో

నిష్టముగ జనించెడి దు

ర్గాష్టమితిథి శుభకరమని యందురు విజ్ఞుల్.

5. సమస్య: “విరసంబగు రచన యొప్పె వీనులవిందై”

 

(షేక్ స్పియరు మహాకవి నీరసముఖుడు. రచనాఘనుడు.)

స్థిరముగ షేక్స్పియరు సుకవి

నరసిన నాతని మొగంబు నచ్చదు మనకున్;

విరివిగ వచనములెందుకు?

విరసంబగు; రచన యొప్పె వీనులవిందై.

 

6.  సమస్య:  “భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ”

 

(భాగవతం వదలి రంకుల భాగవతం చదవటం పాపం)

భగవంతుని జేరగలవు

భాగవతమ్మును నిరతము పఠనము సలుపన్;

భోగపు పురుషుల రంకుల

భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ!

 

7. సమస్య: “చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట”

 

(మద్యనిషేధం మనిషిని మంచివాడిగా మార్చే మంచిపని)

తాగి చీత్కారమొనరించు ధర్మ మనిన;

తూగి తనవారి మర్యాద తొలగజేయు;

మద్యపాయిల నందర మంచిగ మల

చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట.

 

8. సమస్య: “కానరు కాకులను నేడు గానలలోనన్”

 

(కాకులన్నీ పలుగాకులుగా మారి పట్నానికి వచ్చాయి)

కానల లోపలి కాకులు

వైనముగా నగరులందు పలుగాకులుగా

మానవరూపము నందుట

కానరు కాకులను నేడు గానలలోనన్.

9. సమస్య: “సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ”

 

(కొందరు తాగుబోతులు వైష్ణవ గురువు తాతాచార్యునితో)

వీతాచారులు కొందరు

తాతాచార్యుని నెదుటను తాగిన నాల్కన్

భూతావేశమున ననిరి

“సీతాపతి యన్న నెవడు? శివుడే సుమ్మీ!”

 

10. సమస్య: “పట్టుదల యున్న జయము జేపట్టు టెట్లు”

 

(నారదుడు విశ్వామిత్రునితో)

నీవు బ్రహ్మర్షిగా మార నిశ్చయించి

భిన్నరీతుల దపముల నెన్నొ చేసి

చపలుడవయి యోడితివి;యాచరణ లేని

పట్టుదల యున్న జయము జేపట్టు టెట్లు?

 

11. సమస్య: “ముదమున రాహుల్ వరిoచె మోదీ తనయన్”

 

(ఇది ఒక కల)

సదమల నాయకులెల్లరు

కదనము లెవ్వియు నెరుగక కలివిడి నుండన్

మది భావించిన కలలో

ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్.

 

12. సమస్య: “శాపము నిచ్చుటే తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్”

 

(శివధనుర్భంగం చేసిన శ్రీరాముని గురించి పరశురాముడు క్రోధంతో)

పాపమటంచు చింతనము పద్దునకైనను నెంచకుండగా

చాపము చేతపట్టుకొని చయ్యన రెండుగ చేసినాడుగా!

పాపడ వీడు? రాముడని పట్టుగ పేరు ధరించినాడటే?

శాపము నిచ్చుటే తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్.

13. సమస్య:  “క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా”

 

(అమ్మాయి ప్రశ్న – తండ్రి సమాధానం)

“భారతదేశపు బహుముఖ

గౌరవహానికి, ప్రగతికి కారకులెవరో?”

“వేరుగ జెప్పగ దలచిన

క్రూరులు దుష్టులు ఖలులు; పురోహితులు గదా!”

 

14. సమస్య:  “కుండ జొచ్చె మంచుకొండకొడుకు”

 

(మైనాకుడు స్వీయరక్షణార్థం సముద్రంలో దాగటం)

కొండరెక్కలన్ని కోసివేయగదలచి

అరుగుదెంచె వజ్రి యమితకోపి;

సాగరమ్ము గాంచి సత్వరమున నంద

కుండ జొచ్చె మంచుకొండకొడుకు.

 

15.సమస్య: “రాతికి బుట్టినది కోతి రామునివలెనే”

 

(ఆంజనేయజననం)

కాతరరహితుడు కేసరి

నేతకు;వికసితమతికి;వినిర్మలగతికిన్;

నీతివిదస్తుతదనుజా

రాతికి బుట్టినది కోతి రామునివలెనే.

 

16. సమస్య: “పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్”

 

(హరుని ఆపద బాపటానికి పార్వతి హరిని పిలిచింది)

మతిచెడి భస్మాసురు డురు

గతి దరుముచు హరుదల నిడ గరమును జాపన్

బతి కాపద బాపగ శ్రీ

పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్.

17. సమస్య: “యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్”

 

(గంధర్వ గాయకునికైనా మృతి తప్పదు)

అమరము; నుజ్వలకీర్తుల

విమలము; మన ఘంటసాల వేంకన గాత్రం

బమరిక గల; దైనను కా

యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్.

 

18. సమస్య: “ప్రేమ పొంగిపొరలె వీథులందు”

 

(రాజకవి-కవిరాజు పరస్పరం ఎదురైతే)

విజయనగరమందు గజరాజుపై నెక్కి

కదలు కృష్ణరాయకవి యెదురగు

పెద్దనార్యు జూచి ప్రియమున గేల్సాచ

ప్రేమ పొంగిపొరలె వీథులందు.

 

19. సమస్య: “మద్యమును గ్రోలువాడెపో మనుజుడిలను”

 

(పానశాల కావ్యప్రశస్తి)

పారసీకకవికృత రుబాయతులను

రక్తి జదివిన దువ్వూరి రామిరెడ్డి

పానశాలగ తెనిగించె; పరగ పద్య

మద్యమును గ్రోలువాడెపో మనుజుడిలను.

 

20. సమస్య: “కాముం డెనుబోతు విఘ్ననాథుడు కపియౌ”

 

(మట్టితో ఎన్ని రకాల బొమ్మలో)

గీమున బొమ్మల జేయగ

గోముగ మంటిని మథింప గుదిరిక మీరన్

రాముడు భీముడు సోముడు

కాముం డెనుబోతు విఘ్ననాథుడు కపియౌ.

21. సమస్య: “ముని గన్గొన ముదితవలపు ముమ్మరమయ్యెన్”

 

(భీమసేనుని చూసిన హిడింబ అనురాగం)

అనఘుడు; కుంతికి కొమరుడు;

ననిలుని యంశను జననము నందిన ఘనుడౌ

జననుతపరాక్రముడు; భీ

ముని గన్గొన ముదితవలపు ముమ్మరమయ్యెన్.

 

22. సమస్య: “దంష్ట్రలపై శంకరుండు తాండవమాడెన్”

 

(శ్వేతవరాహస్వామిని చూచి శంకరుని నాట్యం)

దంష్ట్రియగు బావ హరిగని,

దంష్ట్రల తళతళ గనుగొని,దనుజుని జీల్పన్

దంష్ట్రల,దాల్పన్ ధరణిన్

దంష్ట్రలపై,శంకరుండు తాండవమాడెన్.

 

23. సమస్య: “భక్ష్యముల నాముదముతోడ వండదగును”

 

(గురువు తన భార్యతో)

కన్నవారిని మరపించి కరుణతోడ

మరచిపోలేని నిండైన మమతతోడ

తన్వి! గురుకులశిష్యసంతతికి సకల

భక్ష్యముల నా ముదముతోడ వండదగును.

 

24. సమస్య: “ఇంద్రుడు సీతకై ధనువు నెత్తెను శల్యుడు మేలుమేలనన్”

 

(గురువుగారి ప్రశ్నలు నలుగురి శిష్యుల సమాధానములు)

“సంద్రములోని నుర్వున నసంగతవృత్రుని జంపె నెవ్వడో?

మంద్రమహాధ్వనిన్ జనులమధ్యన రాము డొనర్చె నెద్దియో?

చంద్రునివంశపాండవులు శౌర్యులు యుద్ధము నెట్లు చేసిరో?”

 “ఇంద్రుడు” “ సీతకై ధనువు నెత్తెను” “శల్యుడు మేలుమేలనన్”.

25. సమస్య: “కాంతకై తపింతురు వార్ధకమున మిగుల”

 

(వృద్ధాప్యంలో పత్నీవియోగ వేదన)

కాలచక్రము వైళమె కదలిపోగ

దేహ మెంతమాత్రమును స్వాధీనపడక

నిత్యపరిచర్య నొనరించు నిపుణ యైన

కాంతకై తపింతురు వార్ధకమున మిగుల.

 

26. సమస్య: “కాంతుడు లేనివేళ గలకంఠి పకాలున నవ్వెనెందుకో”

 

(సాత్రాజితి కృష్ణునిముందు తన ఏకాంతచేష్ట తలచుకొంటూ)

స్వాంతమునందు ప్రాణపతి చల్లగ చక్కగ వేణువూద నే

కాంతము నందు దానపుడు గాటపుకోపమునన్ శిరంబు నా

సాంతము పాదతాడనము సల్పిన దృశ్యము జ్ఞప్తివచ్చి శ్రీ

కాంతుడు లేనివేళ గలకంఠి పకాలున నవ్వెనెందుకో!

 

27. సమస్య: “మాధవుడే కీర్తినందె మదనాంతకుడై”

 

(గౌతముడు బుద్ధుడైనాడని విని యశోధర తన చెలి మాధవితో)

మాధవి! కరుణుని, ప్రేమస

నాథుని, మారుని వనితలు నానాగతులన్

శోధన జేసిన జెదరక

మాధవుడే కీర్తినందె మదనాంతకుడై.

 

28. సమస్య: “మునిపత్నిన్ గొనిపోయి చచ్చెనుగదా మోహాంధుడై యాజిలో”

 

(అత్రి మహర్షి తన సతీమణి అనసూయాదేవితో)

ఘనుడా రావణరాక్షసప్రవరుడే గాధేయు సచ్ఛాత్రుడౌ;

జనులన్ గన్నులబెట్టి చూచుకొను ధీచాతుర్యధుర్యుండునౌ;

వినుతిన్ గాంచిన నీలమేఘతనుడౌ; వేదాంతవేద్యుండు రా

మునిపత్నిన్ గొనిపోయి చచ్చెనుగదా! మోహాంధుడై యాజిలో.

29. సమస్య: “మాంస మిష్టపడు సుమా ద్విజుండు”

 

(కరుణ్ ప్రశ్నలు  – చరణ్ సమాధానాలు)

“వేటగాడు చూడ విరివిగ నేతిండి

నారగింప నెంచు? నారు రుచుల

నోగిరమ్ము దినెడి యుత్సాహి యెవ్వండు?

“మాంస మిష్టపడు సుమా; ద్విజుండు.”

 

30. సమస్య: “నవమినాడు రక్షాబంధనమ్ము వచ్చు”

 

(రమణ ప్రశ్నలు  - రమణి సమాధానాలు)

“సకలసద్గుణగణముల చక్రవర్తి

యైన రామయ్య పుట్టినవైన మెపుడు?

శ్రావణంపు ఘనతయేమి?” “చైత్రశుద్ధ

నవమినాడు; రక్షాబంధనమ్ము వచ్చు.”

 

31. సమస్య: “భారతము వ్రాసి వాల్మీకి వాసికెక్కె”

 

(వ్యాసమహర్షి – వాల్మీకి మహర్షి)

భవ్యమార్గంబు దెల్పె ద్వైపాయనుండు

భారతము వ్రాసి; వాల్మీకి వాసికెక్కె

సర్వజనసమారాధ్యమై సందడించు

రామగాథను వెలయించి రమ్యరీతి.

 

32. సమస్య: “రూపసిని జూచినట్టి కురూపి నవ్వె”

 

(దమయంతీ స్వయంవరం – నల మహారాజు కెదురైన కలిపురుషుడు)

ఇంతి దమయంతి వరియింప నేగుదెంచు

భావభవు సాటి బంగరువన్నెవాడు;

నలుని గాంచి కలి యసూయ వెలికిరాగ

రూపసిని జూచినట్టి కురూపి నవ్వె.

33. సమస్య: “జారుల జూచి భక్తజనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో”

 

(తిరుమలపై  స్వామి వారి అర్చకులను తిలకించిన భక్తులు)

కారుణికత్వదైవమగు కాంచనచేలుడు శ్రీనివాసునిన్

కోరిక మీర దర్శనము కొండపయిన్ దనపత్నియున్ పరీ

వారము తోడ జేసి,తనివారగ స్వామికి సేవజేయు పూ

జారుల జూచి భక్తజనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో.

 

34. సమస్య: “తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ”

 

(అంగదుని వివాహం - వెళదామంటున్న భార్య రుమతో సుగ్రీవుడు)

అంగదుని పెండ్లి కెటుపోదు మతివ! చెపుమ;

అపుడు దుందుభిని వధించినట్టి వాలి

నాటి నుండి చంపగ నెంచె నన్ను; తనదు

తమ్ముని; కొడుకు పెండ్లికి దగదు చనగ.

 

35. సమస్య: “ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే”

 

(కామాంధులను శిక్షించటం తప్పుకాదు)

మోహాంధతతో బాలల

బాహాటంబుగ చెరచుచు బలగర్వితులై

దేహాంతులుగా జేసెడి

ద్రోహుల శిక్షించుట ఘనదోషముగాదే!

 

36. సమస్య: “కుంతీపుత్రుడు వినాయకుడు గద శిష్యా”

 

(శిష్యుని ప్రశ్నలు  - గురువు సమాధానాలు)

“కాంతారంబున గౌరీ

కాంతునిచే పాశుపతము గాంచినదెవరో?

సంతోషి జనకుడెవరో?

“కుంతీపుత్రుడు; వినాయకుడు గద శిష్యా!”

37. సమస్య: “కాముడు వెన్నెలలు గురిసె గంతుడు మెచ్చన్”

 

(చంద్ర మన్మధుల శివతపోభంగ ప్రయత్నం)

ఆ మునినుతిపాత్రుడు శివు

డే మునివృత్తిని గడపగ నెవ్విధి నైనన్

నీమము నడపగ రోహిణి

కాముడు వెన్నెలలు గురిసె గంతుడు మెచ్చన్.

 

38. సమస్య: “విజయసారథి జన్మించె విపినమందు”

 

(భారతి ప్రశ్నలు – ప్రశాంతి సమాధానాలు)

“బావమరదు లుభయులును భవ్యబలులు;
చెరను బుట్టిన శ్యాముడు చెప్పు మెవ్వ?
రతని ముద్దుమరది పార్థు డలరె నెచట?”
“విజయసారథి; జన్మించె విపినమందు.

 

39. సమస్య: “గురువుల పదసేవ జేయగూడదు శిష్యా”

 

(సత్యాచార్యులు – అసత్యాచార్యులు)

గురువులమని చాటుకొనుచు

సిరులకు వశులై సతతము చీకటిమతితో

మరులకు లొంగెడి కుహనా

గురువుల పదసేవ జేయగూడదు శిష్యా!

 

40. సమస్య: “మత్తుమందు సేవించుట మంచిదె కద”

 

(నరనారుల ప్రణయం)

నిత్యపరిణతి నందెడి నిఖిలజగతి

పరమపురుషుని లీలగా వరలుచుండు;

ప్రగతికొరకు స్త్రీపురుషులు ప్రణయ మనెడి

మత్తుమందు సేవించుట మంచిదె కద!

41. సమస్య: “వనమా సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా”

 

(శ్రీకృష్ణునికి అగ్రపుజ చేసిన ధర్మరాజుతో శిశుపాలుడు)

కనుమా ధర్మజ!యింతకంటెను మెరుంగౌవా డలభ్యుండటే!

చనుమా!యర్చన చాలు;మెట్లు దిగు;నీ చాదస్తమున్ వీడుమా!

ఘనులౌ వార లనేకులున్ గలరు;ధిక్కారార్హు డీకృష్ణు సే

వనమా!సాహసమింత చెల్లదు సుమా!బాగోగు లూహింపుమా

 

42. సమస్య: “మానవుడే దానవుడును మాధవు డయ్యెన్”

 

(కంసుడు – కృష్ణుడు)

మానని యధర్మనిరతిని

బూనుచు కంసుడు మెలగెను;బూనిన ధర్మ

జ్ఞానిగ కృష్ణుడు వెలిగెను;

మానవుడే దానవుడును మాధవు డయ్యెన్.

 

43. సమస్య: “హింసకు బాల్పడెడి వాడె హితమును గూర్చున్”

 

(శ్రీనాథ్ ప్రశ్నలు – ఉదయ్ సమాధానాలు)

“హంసను గూల్చిన కరుణా

ధ్వంసకుడగు బుద్ధు సవతితమ్ముం డెవడో?

హింసాదూరుని తెరగో?

“హింసకు బాల్పడెడి వాడె; హితమును గూర్చున్.”

 

44. సమస్య: “పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్”

 

(రక్తపాత రహితంగా రాజ్యమిచ్చిన తండ్రి పూజనీయుడు)

ఆలముతో పనిలేకనె

జాలము నేమాత్రము మది సరకుగొనక నే

కాలము మెచ్చగ రాజ్యపు

పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్.

45. సమస్య: “రామభద్రునకున్ ధర్మరాజు సుతుడు”

 

(రామ భారత కథలు భార్యకు చెబుతున్న భర్త)

రామభారత కథలను రమ్యరీతి

బల్కు కవి యనె “కుశలవద్వయము గలిగె

రామభద్రునకున్;  ధర్మరాజు సుతుడు

పాండునరపాలవరునకు పడతి! వినుము.”

 

46. సమస్య: “ఎలుక వడకె వినాయకు డెక్కుననుచు”

 

(భాగ్యనగరంలో సమున్నత యంత్రవేదికను చూసిన ఎలుక స్పందన)

తాను నమ్మిన తనస్వామి తనను వీడి

యొరులు కల్పించు భ్రమలకు నొదిగిపోయి

యాంత్రికంబైన ఎత్తైన యానము గని

ఎలుక వడకె వినాయకు డెక్కుననుచు.

 

47. సమస్య: “పార్థసారథి పరిమార్చె  బాండవులను”

 

(ఉపాధ్యాయుని ప్రశ్నలు – విద్యార్థిని సమాధానాలు)

“తెలుగుబాలబాలికలార!  తెలుపుడిపుడు;
దుష్టుడైనట్టి నరకుని దునిమె నెవడు?
కృపను భగవాను డెవ్వరి బృథివి గాచె?
“పార్థసారథి పరిమార్చె;  బాండవులను.

 

48. సమస్య: “వరమే పదితలలవాని ప్రాణము దీసెన్”

 

(శూర్పణఖ దుర్బోధ రావణ మరణం)

పురపుర పొక్కుచు రక్కసి

చెరచెర తనయన్న జేరి చేయన్ బోధన్

చురచుర గను రావణు దీ

వరమే పదితలలవాని ప్రాణము దీసెన్.

49. సమస్య: “ద్రౌపది మెడలో గృష్ణుడు తాళి గట్టె”

 

(ద్రౌపదీ పరిణయం – అష్టమహిషీ కల్యాణం)

ఫల్గునుండును తక్కిన పాండవులును

తాళిగట్టిరి ద్రుపదుని తనయయైన

ద్రౌపది మెడలో;  గృష్ణుడు తాళి గట్టె

నష్టరమణుల కత్యంత మాదరమున.

 

50. సమస్య: “గాజులు గల్లనగ గ్రీడి గాండివమెత్తెన్”

 

(భీష్మార్జున సంగ్రామం – నడుమన శిఖండి)

తేజము హెచ్చిన భీష్ముని

నాజిని గొట్టగ శిఖండి నంగనపురుషున్

మోజుగ ముందిడుకొనుచున్

గాజులు గల్లనగ గ్రీడి గాండివమెత్తెన్.

 

51. సమస్య: “సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా”

 

(స్త్రీ వేష ధారులైన పురుషుల పరిస్థితి)

పురుషులు రమణుల వేసము

ధరియించుచు తమ నటనను దండిగ జూపన్,

బొరపాటున గుచము తొలగె;

సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా!

 

52. సమస్య: “గురువారమ్మని పిలువగ గుపితుండయ్యెన్”

 

(అంబ కారణంగా భీష్మ భార్గవరాముల రణం)

పరశువు దాల్చిన రాముని

మెరమెచ్చు పల్కుల నంబ మెల్లగ మార్చెన్;

సరిగా నప్పుడె భీష్ముడు

గురువా! రమ్మని పిలువగ గుపితుండయ్యెన్.

53. సమస్య: “తరువులన్ రక్ష సేయుట తగని చర్య”

 

(శ్రీదేవి ప్రశ్నలు – ప్రశాంతి సమాధానాలు)

“ధరణిపై నున్న నరులకు దప్పని పను

లివ్వి;  ప్రాణరక్షణ కేమి సేయవలయు?

నగరవృద్ధికై చెట్లను నరకవలెన?

“తరువులన్ రక్షసేయుట; తగనిచర్య.”

 

54. సమస్య: “విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్”

 

(హరివందనం అందుకొంటున్న హరుని హాలాహల పానం)

జిష్ణుడు; దేవనికర వ

ర్ధిష్ణుడు; భక్తుల దురితసహిష్ణుదు;విభ్రా

జిష్ణుడు; శంభుడు; వందన

విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్.

 

55. సమస్య: “రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్”

 

(మహా శివరాత్రినాడు మార్తాండ ప్రకాశం)

జ్యోతిర్లింగంబు మురా

రాతియు వాణీపతియును రయమున గనగా

నాతురులై జన, నాశివ

రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్.

 

56. సమస్య: “దొంగలతో దొరల్ గలిసి దోపిడిసేయుట నీతి యిద్ధరన్”

 

(దేశభక్తులు – దేశద్రోహులు)

పొంగులువారగన్ మమత, పొందిక నిండగ,దేశభక్తితో

చెంగట నిల్చి, భారతికి శీర్షము వంచి నమస్కరించు వ

జ్రాంగు లనేకులుండగ స్వరాజ్యసమంచితభావశూన్యులౌ

దొంగలతో దొరల్ గలిసి దోపిడిసేయుట నీతి యిద్ధరన్.

57. సమస్య: “పండితులు వసింపని ధర పావనము గదా”

 

(సుకవులు - కుకవులు)

చండతరంబగు ప్రతిభా

మండితులై వర్ధిలగల మతిమంతులనే

ఖండించెడి దుర్మార్గపు

పండితులు వసింపని ధర పావనము గదా!

 

58. సమస్య: “జింకను గని తక్షణమ్మె సింహము పారెన్”

 

(పరమశివుని చేతిలోని జింకను చూచి పార్వతి వాహనం సింహం పారిపోయింది)

అంకము జేర్పగ నా హరి

ణాంకుడు బ్రేమగ ప్రియసతి నంబిక జేరన్,

శంకను విడచుచు దుమికెడి

జింకను గని తక్షణమ్మె సింహము పారెన్.

 

59. సమస్య: “తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు”

 

(అరణ్య వాసులవుతున్న పాండవులకు అభిమన్యుని ప్రణామం)

చిన్నియభిమన్యు డేమియు జింతలేక

మాయజూదాన విజితులై మరలుచున్న

విశ్వవీరాధివీరులన్ వినుతిగన్న

తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు.

 

60. సమస్య: “చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా”

 

(పట్టరాని ప్రేమ చూపిన అత్తవారింట అల్లుడి ప్రవర్తన)

అక్కర మించిన ప్రేమను

నక్కజముగ జూపిన మరి యల్లుండైనన్

లెక్కన్ జేయం; డమితపు

చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా!

61. సమస్య: “రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్”

 

(సోమరి, నీచుడు చేరితే రంగని భక్తుల స్పందన)

అంగము నలయగనీయక

చెంగట దనవారి గనక చెడుమార్గములన్

వెంగలియై తమ దరి జే

రం గని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.

 

62. సమస్య: “తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ”

 

(నరకచతుర్దశి ప్రాధాన్యం)

ఒద్దిక మీరగ గృష్ణుడు

ముద్దియ సత్య న్నిడుకొని, మోహరమందున్

మొద్దగు నరకుని నరకిన,

తద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ!

 

63. సమస్య: “హరియే మహ్మదు కుదురుగ హరు డేసు గదా”

 

(గురువు ప్రశ్నలు  – శిష్యుల సమాధానాలు)

“సరిగా దెల్పుడు; వైష్ణవ

నరులకు ముస్లిములకు నయనారులకున్

మరియాభినుతుల దైవము?

“హరియే; మహ్మదు; కుదురుగ హరు; డేసు గదా!”

 

64. సమస్య: “ధరలు తగ్గిన జగమెల్ల దల్లడిల్లె”

 

(అట్లాంటిక్ మహాసముద్ర ప్రళయం – ద్వీప సంకోచం)

అవధి మీరుచు నెత్తైన యలలతోడ

అడలుకలిగించు గుండ్రని సుడులతోడ

నింపుగొలిపెడి యట్లాంటి కెగసిపడియె;

ధరలు తగ్గిన జగమెల్ల దల్లడిల్లె.

65. సమస్య: “సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్”

 

(ఒక్కోసారి లోకంలో మంచి పనులే చిత్రంగా ఓటమిని కలిగిస్తాయి)

ఫూత్కారమ్ముల నెరుగక

ఛీత్కారమ్ముల ద్యజించి చిత్రపుజగతిన్

దత్కార్యమ్ముగ సలిపెడి

సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్

 

66. సమస్య: “కన్నుల రెప్పలే యకట కత్తులుగా నను జీల్చె నిల్వునన్”

 

(పారిజాత పుష్పం కోసం అలక పాన్పెక్కిన సత్యతో కృష్ణుడు)

అన్నులమిన్న! సత్య! మది నంతగ గుందగ నీకు నేటికిన్?

జెన్నుగ బారిజాతమును జెంతనె నీవును రాగ, స్వర్గమున్

గ్రన్నన జేరి, యుద్ధమున గ్రందుగ నింద్రు నెదిర్చిదెత్తు; నీ

కన్నులరెప్పలే యకట! కత్తులుగా నను జీల్చె నిల్వునన్.

 

67. సమస్య: “మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్”

 

(మండేందుకు పొయ్యి ఊదుతున్న పల్లె పిల్ల)

కల్లాకపటము లెరుగని

చెల్లెలు గొట్టము చకచక చేకొని యూదన్

పెల్లుగ చేతికి పొగయై

మల్లెలు గడునల్లనయ్యె మాలలుగట్టన్.

 

68. సమస్య: “భారవియె రచించె భారతమును”

 

(ప్రతిభాభాస్కరుడైన వ్యాసుడు భారతకర్త)

నాల్గువేదములను నలువుగా విభజించి,

ఘనపురాణరచన గణుతి గాంచి,

వ్యాసకవివరుండు వ్యాపితసత్ప్రతి

భా రవియె రచించె భారతమును.

69. సమస్య: “విజ్ఞత లేనట్టి నరుడె విజయము నందున్”

 

(తండ్రి ప్రశ్నలు – బిడ్డ ప్రజ్ఞ సమాధానాలు)

ప్రజ్ఞా! విజితుం డెవ్వడు?

జిజ్ఞాసువు జీవితతటి జేరంగలడా?”

యజ్ఞంబంతటి  ప్రశ్నము!

విజ్ఞత లేనట్టి నరుడె; విజయము నందున్.”

 

70. సమస్య: “హర్మ్యమ్మున వెదుక దగునె యానందమ్మున్”

 

 (శకుంతల దుష్యంతునితో భరతుని గురించి)

నర్మ్యపు పలుకులు పలుకుట

ధర్మ్యమ్మగునే నరవర! దర్శింపుమయా!

భర్మ్యపు నందను వదనము;

హర్మ్యమ్మున వెదుకదగునె యానందమ్మున్?

 

71. సమస్య: “భీమసేనుడు తాటకి పీచమడచె”

 

(భీముని హిడింబాసురవధ – రాముని తాటకాసంహారం)

దుష్టరాక్షసు లెవరైన దునుమవలయు;

ధిక్కరించు హిడింబుని నుక్కడంచె

భీమసేనుడు;  తాటకి పీచమడచె

రఘుకులాంబుధిరత్నము రాము డిలను.

 

72. సమస్య: “నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్”

 

(నాగమాత కద్రువ తనమాట పాటించిన బిడ్డలను ముద్దాడటం)

ఆ గతి నశ్వము తోకను

వేగమె నలుపుగ నొనర్చి వెనుకకు తనయుల్

రాగా కద్రువ ముదమున

నాగుల ముద్దాడె లలన నాగులచవితిన్.

73. సమస్య: “తమ్ముని బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్”

 

(సుభద్రాకల్యాణం)

ఇమ్ముగ సఖుతో సల్లా

పమ్ముల నాడుచు నడుగిడు పార్థుని గని మో

దమ్మున ద్వారక ధర్మజు

దమ్ముని పెండ్లాడె నొక్కతన్వి ముదమునన్

 

74. సమస్య: “సవతి లేని యింట సౌరు లేదు”

 

(పారిజాతాపహరణ ప్రబంధ ప్రాభవం)

సత్యవాక్కు వలన సర్వత్ర వ్యాపించె

పారిజాతకావ్యపరిమళమ్ము;

సరసవీరకాంత సాత్రాజితిని బోలు

సవతి లేని యింట సౌరు లేదు.

 

75. సమస్య: “మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్”

 

(తోటకి పూలు, ధనికునికి దానం, గనికి బంగారం, భీమునికి క్రోధం అలంకారాలు)

వనికిన్ వన్నెల పుష్పబాలికలె సంపాదించు సౌందర్యమున్;

ధనికిన్ దానమె సర్వరీతులను సంధానించు మోక్షంబికన్;

గనికిన్ బంగరువంటి లోహములె సంఘాటించు నందంబు; భీ

మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.

 

76. సమస్య: “రావణానుజుండు రాముడు కద”

 

(హర్ష ప్రశ్నలు – వర్ష సమాధానాలు)

“జానకీశు పదము శరణు వేడె నెవడు?

హృదయమందు గరుణ యుదయమంద

బుజ్జియుడుత నెవడు బుజ్జగించె?

“రావణానుజుండు;  రాముడు కద!”

77. సమస్య: “చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్”

 

(తెలంగాణా ప్రజల సంస్కృతికి పరవశించిన మహ్మదీయ మహిళ)

ముద్దగు సంస్కృతి గలిగిన

నొద్దిక తెలగాణ భువిని నొయ్యారంబౌ

విద్దెల గని పరవశయై

చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్బేగమ్.

 

78. సమస్య: “అన్న దమ్ములు రాముడు నంగదుండు”

 

(గీతారాం ప్రశ్నలు – శ్రీరాం జవాబులు)

“కుశుడు లవుడును నెవ్వరో కొడుక! చెపుమ!

వారలకు తండ్రి యెవ్వరో పలుకగలవె?

రావణు మకుటమ్ము నెవ్వడు రమణ దెచ్చె?

“అన్నదమ్ములు; రాముడు; నంగదుండు.”

 

79. సమస్య: “విజయదశమి వచ్చు విదియనాడు”

 

(కొత్త సినిమా గురించి సుందరి – ఇందిర)

“అన్ని కోట్లు పెట్టి యద్భుతమ్ముగ తీసి

నారట గద! చిత్రనామ మేమి?

ఎపుడు విడుదలౌను? ఇందిరా!  చెప్పవే?

“విజయదశమి;వచ్చు విదియ యందు.”

 

80. సమస్య: “గాంధి స్వాతంత్ర్యయోధుడు గాడు నిజము”

 

(గాంధీజీ పేరు పెట్టుకున్న పేట రౌడీ గురించి)

పూజ్యబాపూజి నామంబు పొందినాడు;

చేతులారంగ దుష్కర్మ చేసినాడు;

పెత్తనమొనర్చు మాపేట పెద్దరౌడి

గాంధి; స్వాతంత్ర్యయోధుడు గాడు నిజము.

81. సమస్య: “రాధ  నాలింగనము జేసె రాఘవుండు”

 

(సీతారాముల కౌగిలింత)

మిథిల యందలి ప్రజలెల్ల మిగుల ప్రేమ

గనుల నిలుపుక గాంచెడి గణ్యచరిత;

వీతిహోత్రసంస్తుత; సీత; విమల;నిరప

రాధ నాలింగనము జేసె రాఘవుండు.

 

82. సమస్య: “జనహననము జేయువాడె జనవంద్యు డగున్”

 

(దుర్జన సంహారుడు ప్రశంసార్హుడు)

మననము జేయుచు ధర్మము,

ఘనమగు నడవడి గడపుచు కాలమ్ము, సదా

జననము సార్థకముగ దు

ర్జనహననము జేయువాడె జనవంద్యు డగున్.

 

83. సమస్య: “సోమరితనమ్మె జనులకు సొబగు గూర్చు”

 

(తిరోగతికి సోమరితనం పురోగతికి శ్రమజీవనం)

ఎట్టి దేశమైనను నభివృద్ధి నంద

కుంటకు గతంబు పౌరుల కునికిపాటు,

సోమరితనమ్మె; జనులకు సొబగు గూర్చు

దేహశక్తి, నిరంతరధీరయుక్తి.

 

84. సమస్య: “సత్పుత్రుడొకడు జనింప సద్గతి కరువౌ”

 

(సుపుత్రుడు – కుపుత్రుడు)

తత్పుర మెల్లన్ వెలుగును

సత్పుత్రు డొకడు జనింప; సద్గతి కరువౌ

యత్పుర మందు మదమున న

సత్పథవిహారి మెలగును శాత్రవగతితో.

85. సమస్య: “కరుణను గురిపించదలచి కఠినుడ నైతిన్”

 

(అగస్టన్ తన భార్య మేరీతో కొడుకు జార్జి వాషింగ్టన్ సత్యసంధత మెచ్చుకుంటూ)

అరుణారుణదేహుండు; కొ

మరుడగు జార్జి నిజమాడి మనసున్ గదిపెన్;

మరియా! సుతుపై నిండగు

కరుణను గురిపించదలచి కఠినుడనైతిన్.

 

86. సమస్య: “పుణ్య మార్జింప బొరుగింటి పొలతి గూడె”

 

(పరమ కాముకుడు కావించిన పాడుపని)

నిగమశర్మను బోలెడు నీచుడొకడు

భార్య నంపె బుట్టింటికి వ్రతము సలిపి

పుణ్య మార్జింప; బొరుగింటి పొలతి గూడె

కనుల గప్పిన కామంపు గావరాన.

 

87. సమస్య: “పసుల సేవ పరమపద మొసంగు”

 

(దిలీపుడు, శ్రీకృష్ణుడు, సహదేవుడు గో సేవ కావించారు)

ధేనుసేవ జేసె ధీరదిలీపుండు;

మాద్రిబిడ్డ డాలమంద గాచె;

గోగణమున దిరిగె గోపాలకృష్ణుండు;

పసులసేవ పరమపద మొసంగు.

 

88. సమస్య: “నెలజూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్”

 

(బాణాసుర పుత్రి ఉష కలలో అనిరుద్ధుని తిలకించి)

కలలోపల ననిరుద్ధుని

చెలువమ్ము నుషాకుమారి చెంగట గనియెన్;

మిలమిల మెరసెడి పున్నమి

నెల జూచి లతాంగి యేడ్చె నేరుపుమీరన్.

89. సమస్య: “వడ్డించెడివాడు శత్రువా తిననొప్పున్”

 

(చాపకూడు పెడుతున్న బ్రహ్మనాయడు ఒక ఛాందసునితో)

గడ్డంబును నిమురుకొనుచు

నడ్డంబుగ మీశిరమును నటునిటు నేలన్

విడ్డూరంబుగ ద్రిప్పగ?

వడ్డించెడివాడు శత్రువా? తిననొప్పున్.

 

90. సమస్య: “కారము నయనముల జల్లగన్ హిత మబ్బున్”

 

(ఓంకార ధ్యానం – విశ్వకుటుంబ భావనం)

వీరలు నాకున్ మిత్రులు;

వారలు శత్రులు; ననియెడి భావము త్వరగా

దూరము జేయునుగద నోం

కారము; నయనముల జల్లగన్ హిత మబ్బున్.

 

91. సమస్య: “కరణమేల కావ్యకరణమునకు”

 

(కావ్యప్రపంచ ప్రజాపతి కవి)

లోకమెల్ల కవివిలోకనము వలన

నవరసరుచి తోడ నాట్యమాడు;

ప్రతిభ పరిమళించు పరిపూర్ణకవికి వ్యా

కరణమేల కావ్యకరణమునకు?

 

92. సమస్య: “తనయుడు పతి యయ్యె తరుణి మురిసె”

 

(వాసిష్ఠి - గౌతమీపుత్రశాతకర్ణుల పరిణయం)

వజ్రభావభరిత వాసిష్ఠిరమణికి

చండశాసనుండు, శౌర్యధనుడు,

శాతకర్ణి, యాంధ్రసమ్రాట్టు, గౌతమీ

తనయుడు పతియయ్యె; తరుణి మురిసె.

93. సమస్య: “తమ్ముల నిరసించె రామధరణీశు డొగిన్”

 

(ఖరదూషణాది రాక్షసులను సంహరిస్తున్న శ్రీరామచంద్రుడు)

వమ్మవకుండగ వేవే

లమ్ముల గురిపించుచు గగనాంగణ మంతన్

గ్రమ్మి ఖరదూషణవ్రా

తమ్ముల నిరసించె రామధరణీశు డొగిన్.

 

94. సమస్య: “బాలభానుడు నేలపై పరుగులెత్తె”

 

(రాజప్రాసాదంలో బాలరాముని పరుగులు)

సూర్యవంశాన బుట్టిన సుందరుండు;

నీలిచిరుమబ్బు బోలిన మేలిశిశువు;

నమ్రకోసలజనకోటి నయనపద్మ

బాలభానుడు; నేలపై పరుగులెత్తె.

 

95. సమస్య: “కాంతను సేవించువారె ఘనులు జనహితుల్”

 

(ఐహికబంధాల పట్ల అంటీ అంటనట్లుండే ముముక్షువులు)

శాంతము బూనుచు, సుఖ మా

సాంతము వీడుచు, స్థిరమతి సద్గురుకరుణన్

ధ్వాంతము వెల్వడి మోక్షపు

కాంతను సేవించువారె ఘనులు జనహితుల్.

 

96. సమస్య: “కాలు పెండ్లియాడె కరము వలచి”

 

(పార్వతీ కల్యాణం)

ఆదిదేవు డాత; డాద్యంతరహితుండు;

సర్వభక్తజన వశంకరుండు;

పర్వతేశుపుత్రి పార్వతి యమ్మహా

కాలు పెండ్లియాడె కరము వలచి.

97. సమస్య: “ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే”

 

(దానదయాగుణ రహితునికి లక్ష్మీవ్రత ప్రయోజనం సిద్ధించదు)

వినుడో సహృదయులారా!

ఘనమగు దాతృత్వగుణము గలుగక జనులన్

నెనరున గాననివానికి

వరలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే.

 

98. సమస్య: “రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుడే”

 

 (మతి భ్రమించిన పండితుని పలవరింతల గురించి పలుకుతున్న పుత్రుడు)

షణ్మాసములు గడచె;నీ

షణ్మాత్రము వైద్యమికను సత్ఫల మిడదే?

మృణ్మయమతి నతడిటులను;

రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుడే.”

 

99. సమస్య: “మారీచుడు రాము జంపి మాన్యుం డయ్యెన్”

 

(కరుణ్ ప్రశ్నలు – చరణ్ జవాబులు)

భీరత్వంబున నెవ్వా

డేరిని వంచితు నొనర్చె? నేపని జేసెన్

శ్రీరాముడు రావణు నని?”

మారీచుడు రాము; జంపి మాన్యుండయ్యెన్.”

 

100. సమస్య: “చరణముతో బతికి సేవ సలిపెను సతియే”

 

 (తన ఆయువునిచ్చిన రురునికి ప్రమద్వర సేవ)

అరయగ బ్రమద్వర హఠా

న్మరణము నందగ దనదగు మాన్యపుబ్రతుకున్

రురు డీయగ బ్రతికి సదా

చరణముతో బతికి సేవ సలిపెను సతియే.

101. సమస్య: “దశకంఠుని గొల్చు నరులు ధన్యులు గదరా”

 

(రావణుడు మనసు మార్చుకొని సీతను శ్రీరామునికి అప్పగిస్తే)

నిశలున్ బవలున్ జింతిలి

వశమున నుండిన జనకజ వలదని తనదౌ

దిశ మార్చి రామున కొసగు

దశకంఠుని గొల్చు నరులు ధన్యులు గదరా!

 

102. సమస్య: “గట్రాచూలికి బతి హరి కంతుడు సుతుడే”

 

 (మద్యపానమత్తుని మాటలు)

వట్రువ దిరిగెడి కనులన్

నిట్రపు నడకల నెరుగని నీచుడు పలికెన్

జట్రము గోల్పడు మతితో

“గట్రాచూలికి బతి హరి; కంతుదు సుతుడే.”

 

103. సమస్య: “జిహ్వికకు పంచదారయె చేదు గాదె”

 

 (చక్కెరవ్యాధి తీవ్రత)

చిన్నదైనను చెదపుర్వు చేరియున్న

మహితపుస్తకమైనను మట్టిచేయు;

తలప మధుమేహరోగమ్ము తనువుజెరచు;

జిహ్వికకు పంచదారయె చేదు గాదె?

 

104. సమస్య: “నాగపూజ సేయ నరకమబ్బు”

 

(జనమేజయుడు సభాసదులతో తనతండ్రి పరీక్షిత్తు మరణాన్ని పురస్కరించుకొని)

పాండువీరులకును పసమించు మనుమని;

నడత తప్పనట్టి నాదు జనకు

దనువు గరచి చంపె దక్షకదుష్టుండు;

నాగపూజ సేయ నరక మబ్బు.

105. సమస్య: “తండ్రితో రతికేళిని దనయ కోరె”

 

(తల్లిలేని ఆడపిల్లలు తండ్రితో పలుకుతున్న సందర్భం)

రంగరావుకు బిడ్డలు రతియు నతియు;

వేగ క్రొత్తదౌ సినిమాకు నేగుదమనె

తండ్రితో రతి; కేళిని దనయ కోరె

నతియె చెస్సుబోర్డు నమర్చి నమ్రరీతి.

 

106. సమస్య: “దుర్యోధను బెండ్లియాడి ద్రోవది మురిసెన్”

 

(దుర్యోధనునితో భానుమతికి అర్జునునితో ద్రౌపదికి వివాహం)

భార్యగ భానుమతి కొలిచె

దుర్యోధను; బెండ్లియాడి ద్రోవది మురిసెన్

శౌర్యోదాత్తుడు నర్జును;

నార్యావర్తంబు నందు నగణితధీరున్.

 

107. సమస్య: “కవి కిద్దఱు భార్యలున్న గను సుఖ కీర్తుల్”

 

(కవికి సఖివల్ల సుఖం - కవితాసఖి వల్ల కీర్తి)

చవి నిచ్చు నొక్క సఖియును;

ఛవి నిచ్చును గద మరియొక సఖియును; జూడన్

సవిధాంగన, కవితాంగన

కవి కిద్దఱు భార్యలున్న గను సుఖకీర్తుల్.

 

108. సమస్య: “పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్”

 

(నిరంతరం మాంసం ప్రక్కనే బంధింపబడిన చిలుక పండ్లు తినడం మానేసింది)

బలిమిన్ బోయడు గూటన్

మలమల మాడ్చుచు శుకమును మాంసము కడనే

నిలిపెన్ నిరంతరంబున్;

బలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్.

109. సమస్య: “కార్తికపూర్ణిమను గంటి గద నెలవంకన్”

 

(ఆదర్శ దర్శకుడు జంధ్యాల గారి మానవతాచిత్రం “నెలవంక”గురించి)

స్ఫూర్తిని గొలిపెడి దర్శక

మూర్తియె జంధ్యాల;వారు మురియగ ప్రజలే

యార్తిగ దీసిన చిత్రము

గార్తికపూర్ణిమను గంటి గద “నెలవంకన్.”

 

110. సమస్య: “సింగమ్మును గాంచినపుడె చింతలు దొలగున్”

 

(అశ్వారోహణం చేస్తున్న రాణాప్రతాపసింహుడు)

చెంగున మీసము దువ్వుచు

నంగలు వైచుచు తురగము నధిరోహించెన్

బొంగుచు బ్రతాప రాణా;

సింగమ్మును గాంచినపుడె చింతలు దొలగున్.

 

111. సమస్య: “పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి”

 

(సూర్యుని వంటి సూక్ష్మబుద్ధి గల ద్రౌపదికి భర్తలు ఐదుగురు)

యజ్ఞవేదిక బుట్టిన యాజ్ఞసేని;

సూర్యకిరణము బోలిన సూక్ష్మబుద్ధి;

భానుమతియైన ద్రౌపదీభామ యామె;

పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి.

 

112. సమస్య: “సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ”

 

(అల్లూరి సీతారామరాజు మల్లుదొర గంటందొరలతో)

పరమదుర్మార్గగాములై భరతదేశ

భూముల గబళించెడి యాంగ్లభూతములను

బారదరిమెద; వారల మందుగుండు

సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ.

113. సమస్య: “భీముడు యుద్ధరంగమున భీష్ముని జంపె బరాక్రమోద్ధతిన్”

 

(కురుక్షేత్రయుద్ధం మూడవరోజున దుస్స్వప్నబాధితుడైన ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో)

ఏమది పుత్రకా! మిగుల నేమరుపాటున నుంటివిట్టులన్?

నామది ఛిద్రమై యిపుడు నర్మిలి కోల్పడి కుందుచున్నదే!

వామపుకంటిలో మిగుల వడ్కులుపుట్టెను; స్వప్నమందునన్

భీముడు యుద్ధరంగమున భీష్ముని జంపె బరాక్రమోద్ధతిన్.

 

114. సమస్య: “కరణము నమ్మువారలకు గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా”

 

(వాగమృతాన్ని పంచే వ్యక్తిని నమ్మటం శ్రేయోదాయకం)

శరణము బొందగావలెను సర్వవిధమ్ముల సత్యనిష్ఠతో

తరణము దెల్పు బోధకుని; తత్వవిదుండగు దేశికోత్తమున్;

మరిమరి బుజ్జగింపగల మంజులమూర్తిని; వాక్సుధా శుభం

కరణము నమ్మువారలకు గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా.

 

115. సమస్య: “శివభక్తవరేణ్యు డనగ శ్రీశ్రీయె కదా”

 

(మహాప్రస్థానకావ్యంలో హరస్మరణతో కదలమన్నారు శ్రీశ్రీ)

శివుని “హరోం హర హర హర

భవ యని తలచుచు నరచుచు పదుడు పదు” డనెన్

నవయువకుల దనకవితను;

శివభక్తవరేణ్యు డనగ శ్రీశ్రీయె కదా!

 

116. సమస్య: “కవుల బురస్కృతుల జేయగా వల దెపుడున్”

 

(సరసులను మరచి విరసులను సత్కరింపరాదు)

చెవులకు చవులన్ గొలుపుచు

ఛవులన్ నింపెడి నిపుణపు సరసపు గవిమా

ధవులన్ మరచి వికృతకా

కవుల బురస్కృతుల జేయగా వలదెపుడున్.

117. సమస్య: “పుస్తకము బఠింత్రు మూర్ఖజనులు”

 

 (పుస్తకాల పురుగులైన విద్యార్థులు)

తారచంద్రసూర్యధవళిమ లెఱుగరు;

విరుల తరుల ఝరుల గిరుల గనరు;

నెమలి చిలుక పికపు నెయ్యము జేయరు

పుస్తకము బఠింత్రు మూర్ఖజనులు.

 

118. సమస్య: “పొడి యొనర్చువాని బొగడ వశమె”

 

(కీచక వధ)

రౌద్రరూపధరుడు; ద్రౌపదీనాథుండు;

సిగ్గునెగ్గులేని సింహబలుని

మల్లయుద్ధమందు మట్టుబెట్టుచు పొడి

పొడి యొనర్చువాని బొగడ వశమె!

 

119. సమస్య: “బొంకునట్టివాడె పూజ్యు డగును”

 

(గిరీశం వెంకటేశంతో)

వెంకటేశ! వచ్చి వినవోయి నామాట;

విధవయువతి నెపుడు విడువబోకు;

కనులు మూసి కాల్చు గట్టిగా పొగచుట్ట;

బొంకునట్టివాడె పూజ్యుడగును.

 

120. సమస్య: “పరమపదము లభ్యమగును పాపాత్ములకే”

 

(ఏసుక్రీస్తు కరుణాగుణం)

కరకుగ బాధించిన ప్రజ,

నరులను దిద్దిన దయార్ద్రనరుడగు జీసస్

చరమదశను క్షమియించెను;

పరమపదము లభ్యమగును పాపాత్ములకే.

121. సమస్య: “భరతు దునిమె రాఘవుండు భామిని కొఱకై”

 

(శాపోపహతులైన జయవిజయులలో రావణుడైన జయుని శ్రీరాముడు సంహరించటం)

నిరతము హరిశుభచరణము

మరువని రావణుడగు జయు, మహితోద్దామున్,

మరణాసక్తున్, మోక్షా

భరతు దునిమె రాఘవుండు భామిని కొరకై.

 

122. సమస్య: “శ్రీకృష్ణుని కంటె ఘనుడు శిశుపాలుండే”

 

(కృష్ణునికి అగ్రపూజ వద్దని ధర్మరాజును వారిస్తున్న శిశుపాలుని సేనాపతి సుమేథుడు)

ఈ కేశవు కిడకర్ఘ్యము;

నేకాలము భజనపరుల యెక్కుడు పలుకుల్

నీ కర్ణంబుల నింపకు;

శ్రీకృష్ణునికంటె ఘనుడు శిశుపాలుండే.

 

123. సమస్య: “పండుముసలిని వరియించె బంకజాక్షి”

 

(నందమూరి వారిని వరించిన లక్ష్మీపార్వతి)

అనఘు; డాజానుబాహుండు; నమితయశుడు;

నటనయం దారితేరిన నమ్రమూర్తి;

రాజకీయాల రాణించు రాజరాజు;

పండుముసలిని వరియించె బంకజాక్షి.

 

124. సమస్య: “రమణికిన్ బూలు చేటగు బ్రాయమందు”

 

(బాలవితంతువు బుచ్చమ్మకి పూలుపెట్టబోతున్న భార్య వెంకమ్మతో అగ్నిహోత్రావధానులు)

విధవ కెందుకె పూమాల వెఱ్ఱివెంకి?

ఆకతాయివెధవలేమొ యధికమయిరి;

పూలు దాల్చిన బుచ్చమ్మ ముంచుకొంప;

రమణికిన్ బూలు చేటగు బ్రాయమందు.

125. సమస్య: “వాణికి దేహార్ధ మొసగె ఫాలాక్షు డొగిన్”

 

(పార్వతికి అర్ధశరీరం ఇచ్చిన పరమేశ్వరుడు)

వాణియు లక్ష్మియు చామర

పాణులగుచు నిరుగడలను బంభరశోభా

వేణులు కొలువ వెలుగు శ

ర్వాణికి దేహార్ధ మొసగె ఫాలాక్షు డొగిన్.

 

126. సమస్య: “చోరుని సముడు కవి యనుట చోద్యమ్మగునే”

 

(కవి చదువరుల చిత్తచోరుడు)

తీరుగ ననేక విధముల

నారుల నరుల హృదయముల నయముగ దోచున్

గా రసికసుకవి;కావున

చోరుని సముడు కవియనుట చోద్యమ్మగునే?

 

127. సమస్య: “అవధానము జేయువాడె యతిమూర్ఖు డగున్”

 

(వేగం, తెలివి, సరసత లేని అవధాని)

వ్యవధానము విపరీతము;

నవనవమేధారహితము; నాజూకుదనం

బవదీర్ణ; మధోదృక్కుల

నవధానము జేయువాడె యతిమూర్ఖు డగున్.

 

128. సమస్య: “శంకరుడెత్తె హిమగిరిని సతి వెఱ గందన్”

 

(కైలాసగిరి నెత్తిన రావణుడు)

హుంకారుడు; బహుధిషణా

హంకారుడు; విపులతనుమహాద్భుతతేజో

లంకారుడు; దిక్పాలవ

శంకరుడెత్తె హిమగిరిని సతి వెఱ గందన్.

129. సమస్య: “పద్మములు ముకుళించెను భాను జూచి”

 

(రాకుమారి కుంతి సూర్యోదయదర్శనం)

మౌని దుర్వాసు డిచ్చిన మంత్రరాజ

మును మనమున నిలుపుకున్న ముగ్ధ కుంతి

యపుడె సూర్యోదయము జూచె; నామె నేత్ర

పద్మములు ముకుళించెను భాను జూచి.

 

130. సమస్య: “పగతుర పాదపద్మముల బట్టగ వీరుల కొప్పు నాజులన్”

 

(సమరారంభంలో భీష్మాదులకు ప్రణతుడైన ధర్మజుని గురించి రారాజుతో శకుని)

వగవక ధర్మరాజు మనపక్షము నందలి పెద్దవారికిన్

మొగమును వంచివంచి యిటుమొక్కగ గారణమేమియందువా?

మగటిమి చాలదంచు; మిము మార్కొనలేమని; మాయచేష్టలన్

పగతుర పాదపద్మముల బట్టగ వీరులకొప్పు నాజులన్.

 

131. సమస్య: “గౌరికి గేశవుడు భర్త గావలె నెన్నన్”

 

(మహాలక్ష్మీ  కల్యాణం)

ధీరకు, నుజ్జ్వలసుగుణా
ధారకు, గోలాసురేంద్రదమనకు, విమల
క్షీరసముద్రజకు, యశో
గౌరికి గేశవుడు భర్త గావలె నెన్నన్
.

 

132. సమస్య: “సత్యమును బల్కడట హరిశ్చంద్ర నృపతి”

 

(విశ్వామిత్రుడు వశిష్టునితో)
అహహ
! శిష్యు హరిశ్చంద్రు నవధి దాటి
యేల నీరీతి బొగడెద వింతతడవు?
ప్రతిన గావించి పలికెద పట్టు విడుము;
సత్యమును బల్కడట హరిశ్చంద్ర నృపతి
.

133. సమస్య: “శ్రీరాముం డపహరించె సీతాదేవిన్”

 

(పూజ్యుడు శ్రీరాముడు – అసూయాపరుడు రావణుడు)

ఆరాధితసీతాపతి
శ్రీరాముం; డపహరించె సీతాదేవిన్
క్రూరాత్ముడు లంకాపతి
దారుణముగ రావణుండు దైత్యుం డీర్ష్యన్
.

 

134. సమస్య:  “మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్”

 

(ఇల్లాలు సంతానవతి కాగానే భర్త దృష్టి)

“కదలను మెదలను చెదరను
వదలను ని” న్నని ప్రతినలు పలికిన పతికిన్
ముదితయె సంతును కనగా
మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్.

 

135. సమస్య:  “కుంతికి శతసుతుల్ గల్గ సంతసిల్లె”

 

(సంతానవతులైన కుంతీగాంధారులు)

మాద్రి సుతుల దన సుతుల మమతగ గని
తన్మయత్వము మదిలోన తరగ లెత్తె
గుంతికి; శత సుతుల్ గల్గ సంతసిల్లె
సాధ్వి గాంధారి పతి దాకి సరభసమున
.

 

136. సమస్య:  “వేంకటపతికి భామలు వేయిమంది”

 

(కల్యాణ శ్రీనివాసుని అలంకరణ)

చెలియ పద్మావతీదేవి చెట్టపట్టు
సరసవరునకు కైసేత సలుపగ తిరు
వేంకటపతికి భామలు వేయిమంది
కార్యమగ్నలుగ నయిరి కమ్రరీతి
.

137. సమస్య:  “రాయల వారికిన్ దెలుగు రాదు గదా రసమున్ గ్రహింపగన్”

 

(భువనవిజయ మహాసభలో తెలుగు తెలియని విదేశ రాయబారుల పరిస్థితి)

మాయని వ్యంగ్యపద్యముల మంజులభంగి కవుల్ వచింపగా,
తీయనితెల్గుపల్కుబడితేనెలు పారగ మాటిమాటికిన్,
పేయసు వంటివారటులె పెద్దగు కన్నుల జూచుచుండి రా
రాయల, వారికిన్ దెలుగు రాదుగదా
! రసమున్ గ్రహింపగన్.

 

138. సమస్య:  “రావణుడు ప్రియాత్మజుండు రఘురామునకున్”

 

(శ్రీహరి సేవకుడైన జయుడే రావణుడు)

సేవకుడు జయుడు సుతసము
డా విష్ణునకు; సనకాదు లాగ్రహమందన్
జావగ బుట్టిన దైత్యుడు,
రావణుడు, ప్రియాత్మజుండు రఘురామునకున్
.

 

139. సమస్య:  “సవతిని గని సీత మిగుల సంతసమందెన్”

 

(వసంతోదయం – సీత సంతోషం)

జవజవ శిశిరము వనమున
జవజీవములను హరించె; చైత్రము రాగా
చివురుల నవవనమధుమా
సవతిని గని సీత మిగుల సంతసమందెన్
.

 

140. సమస్య:  “కుట్మలదంతీ తమపయి గోరిక గల్గెన్”

 

(అరవిరి మొగ్గలవంటి పలువరుస గల అమ్మాయి)

నట్మయమగు వాక్కు లనకు ;
పట్మని యిపుడే పలికెద పట్టుగ వినుమా
!
చిట్మట లాడకు నాపై;
కుట్మలదంతీ! తమపయి గోరిక గల్గెన్.

141. సమస్య:  “అమ్మా యని పిలువని సుతు డతిపూజ్యు డగున్”

 

(నవవనితలకు మమ్మీ అనిపిలిచే కొడుకంటేనే ఇష్టం)

సమ్మతి గాంతలు బిడ్డల
మమ్మీ! యనియే పిలువుడు; మరచిన దెబ్బల్
సుమ్మీ
! యని బోధింపగ
నమ్మా
! యని పిలువని సుతు డతిపూజ్యు డగున్.

 

142. సమస్య:  “పున్నమి దినమయ్యెను శశి పొడగట్టడుగా”

 

(అమావాస్య దీపావళి కాంతులతో పౌర్ణమి అవుతుంది)

మన్నిక దీపావళినిశి
నెన్నెన్నియొ బాణసంచ నేర్పడ గాల్చన్
చెన్నుగ వెలుగులు నిండెను;
పున్నమిదినమయ్యెను శశి పొడగట్టడుగా
!

 

143. సమస్య:  “రమ్ము గ్రోల జబ్బు రాదు దరికి”

 

(రమ్ము కంటే ఉసిరిక రసం ఆరోగ్యకరం)

ఎరుక లేకపోయి ఎన్నెన్నొ బాధల
బడగ నేలనోయి పద్మరావ?
ఒక్కమాటను విను ముసిరిరసపు సా;
రమ్ము గ్రోల; జబ్బు రాదు దరికి.

 

144. సమస్య:  “వెన్నెలరేయియే తనువు వెచ్చగ జేసెను సుందరాంగికిన్”

 

(రాయల వారి యుద్ధయాత్ర – తిరుమలదేవి విరహవేదన)

ఎన్నగ గృష్ణరాయధరణీశుడు వైరులపాలి మృత్యువై
కన్నుల క్రోధవీక్షణలు గమ్యము జేర్పగ దారిచూపగా
నన్నులమిన్న వీడి రణయాత్రకు సాగగ దిర్మలాంబకున్
వెన్నెలరేయియే తనువు వెచ్చగ జేసెను సుందరాంగికిన్
.

145. సమస్య:  “పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్”

 

(అపశబ్దాలు లేని పద్యరచన హృద్యం)

చదివినయంతనే యెదల చల్లగ సోకెడి రీతియుండగా,
పెదవులనుండి నాల్కపయి పెల్లుగ నాట్యమొనర్చు నట్లుగా,
సదమలవృత్తి నెల్లపుడు చక్కగ సంఘము మెచ్చ, నెట్టి దు
ష్పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవులెల్ల రౌననన్
.

 

146. సమస్య:  “తెలుగు తెలుగని ధీవరుల్ వలుక దగునె”

 

(పాల్కురికి సోమనాథుడు తెలుగుపల్కులను వేదాలతో సమానంగా భావించాడు)

తెలుగుపలుకు లనంగను వలనుపడదు

వేదముల కొలదియగనె పేర్కొనుండు

తెలుగు తెలు గని ధీవరుల్ వలుక; దగునె

సభల మనబాస పలుచన సలుపుటెల్ల?

 

147. సమస్య:  “నన్నయభట్టు కన్నడమునన్ రచియించెను మేటికావ్యమున్”

 

(నన్నయ మహాకవి-పంప మహాకవి)

మన్నిక మెచ్చ పండితులు మంజులశైలిని తెన్గుబాసలో

గన్నులగట్టు వర్ణనల గమ్మగ వ్రాసెను భారతంబునున్

నన్నయభట్టు; కన్నడమునన్ రచియించెను మేటికావ్యమున్

పొన్నరికాన పంపకవి పొంగిన చిందిన భావసంపదన్.

 

148. సమస్య:  “పిడికిలిలోన నాకు గనుపించె దివాకర చంద్ర బింబముల్”

 

(ప్రళయకవితను, ప్రణయకవితను సృజించగల మహాకవి శ్రీశ్రీ)
ఎడయక ఠీవితోడ తలయెత్తుచు సాగెడి రౌద్రగీతముల్,
తడిసిన గుండె నుండి విడి తద్దయు పొంగెడి ప్రేమగీతికల్,
వడివడి వ్రాయగల్గు కవివౌ “సిరిరంగపు శ్రీనివాస
!” నీ
పిడికిలిలోన నాకుగనుపించె దివాకర చంద్రబింబముల్
.

149. సమస్య:  “లలిని బ్రపంచ తెల్గుసభలన్ గన నేగెడువారు మూర్ఖులే”

 

(ప్రపంచ తెలుగుమహాసభలు – ప్రేక్షక సందోహం)

కలకలలాడు మోములను కమ్మని సంస్కృతి కందళింపగా;
మిలమిలలాడు దుస్తులవి మెచ్చులు గొల్పగ నెల్లవారికిన్;
తెలియక రేబవళ్ళు;పెనుదీవన లందగ తల్లిసేవకై
లలిని బ్రపంచతెల్గుసభలన్ గన నేగెడువారు మూర్ఖులే?

 

150. సమస్య:  “దమయంతిని బెండ్లియాడె ధర్మసుతు డొగిన్”

 

 (క్రాంతి ప్రశ్నలు – వంశీ సమాధానాలు)
సుమధురవచనుడు నిషధుం
డమలుం డెవ్వరి వివాహమాడెను చెపుమా ?
కమలనయన ద్రౌపదినో?”
దమయంతిని; బెండ్లియాడె ధర్మసుతు డొగిన్
.

 

151. సమస్య:  “బడి యనంగ  బ్రజలు భయపడుదురు”

 

(ప్రజలకు ప్రియం బడి – భయం చేతబడి)

పలుకుబడి దెలిపెడి ప్రతిభుడౌ అయవారి
వ్రాతబడిని నేర్పు పంతులమ్మ
గాంచి మ్రొక్క గలరు; గమనింపగా చేత
బడి యనంగ బ్రజలు భయపడుదురు.

 

152. సమస్య:  “తెలుగు బఠించువారలిక దేహి యటంచును జేయి జాపరే”

 

(తెలుగు విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి అభయం)

తెలుగు బఠించువారలిక దేహి యటంచును జేయి జాపరే!
నలుగుటలేమొ తప్పవిక; నమ్ముడు మాదవు మాటలింక;” నం
చలసట లేక వాగిరదె యర్భకధూర్తులు కొంతమంది; యా
మలయసమీరతుల్యుడగు మాన్యుని నమ్ముడు
చంద్రశేఖరున్.

153. సమస్య:  “బారని చెప్పగానె విని బాపడు సంతసమందె జూడుమా”

 

(కృష్ణుని దర్శించి వచ్చిన కుచేలునితో భాగ్యవతియైన భార్యామణి)

జారని సఖ్యభక్తి దన చక్కనిమిత్రుడు నందనందనున్

జేరిన వేదతేజుడు కుచేలుడు గౌరవమంది యేమియున్

గోరక యింటికేగ; సతి గోముగ “రండిక నెక్కు డేనుగం

బా” రని చెప్పగానె విని బాపడు సంతసమందె జూడుమా!

 

154. సమస్య:  “పోరాటము జేయ శస్త్రముల పని యేలా”

 

(అహింసాదీక్షాదక్షులకు ఆయుధాలతో పనిలేదు)

ఆరాధ్యుడు గాంధి వెనుక
హేరాళంబగు ప్రజ “జయహిం”దని యనుచున్
ధారాళంబగు దీక్షను
పోరాటము జేయ శస్త్రముల పని యేలా?

 

155. సమస్య:  “విల్లది  రామునకు నైన విరువ దరమ్మే”

 

(శ్రీరాముని శివధనుర్భంగ సమయంలో పరశురాముడు రౌద్రంతో)

నల్లనిపిల్లడు; వీడా
ప్రల్లదుడయి మాయగ విలు భంగము జేసెన్?
జెల్లదు; మద్గురువగు హరు
విల్లది; రామునకు నైన విరువ దరమ్మే?

156. సమస్య:  “సవతిని గని సీత మిగుల సంతసమందెన్”

 

(శ్రీరాముని అశ్వమేధయాగం – స్వర్ణసీతను తిలకించిన సీత)

సవనము సేయగ రాముడు
సవిధము నందున గనకపు సతినే నిలుప
న్నవనిజ రహస్యగతి జని
సవతిని గని సీత మిగుల సంతసమందెన్.

157. సమస్య:  “భార్యను సేవించునట్టి భర్త తరించున్”

 

(అర్ధనారీశ్వరతత్వం)

భార్యను సగముగ దాల్చుచు
నార్యవిభుండు పరమశివు డద్భుతఘనమౌ
చర్యగ జూపెను; గావున
భార్యను సేవించునట్టి భర్త తరించున్
.

 

158. సమస్య:  “ఏకాదశి నాటి పూజ లిడుముల గూర్చున్”

 

(అంబరీషుని వ్రతసమాప్తి – దుర్వాసుని దురాగ్రహం)

ఏకైకు డంబరీషుడు;
లోకైకశుభంకరమధురోహారోహుం;
డాకులు డాయెన్ మునిచే;
నేకాదశి నాటి పూజ లిడుముల గూర్చున్.

 

159. సమస్య:  “దౌర్భాగ్యము నిచ్చి బ్రోచు దామోదరుడే”

 

(దరిద్రుని ధనికునిగా కావించేది నారాయణుడే)

ఆర్భటి మార్చెన్ జ్యేష్ఠయ
దౌర్భాగ్యము నిచ్చి; బ్రోచు దామోదరుడే
యర్భకు నన్నున్ బ్రీతిగ
నిర్భాగ్యు నెపుడును కరుణ నిండిన కనులన్
.

 

160. సమస్య:  “రావణుని బెండ్లియాడె ధరాతనూజ”

 

(మండోదరీ రావణులు – జానకీ రఘురాములు)

మయుని తనయ మండోదరి మంజురూప
పరిణయంబాడె శివభక్తు బ్రహ్మవంశ్యు
రావణుని; బెండ్లియాడె ధరాతనూజ
రమ్యగుణధాము రఘువంశ్యు రామచంద్రు
.

161. సమస్య:  “కన్నవారి కన్న ఖలులు గలరె”

 

(తల్లిదండ్రులు భువిలోని దేవతలు)

గుణము, దేహమిచ్చు గొప్పవారలు లేరు
కన్నవారికన్న; ఖలులు గలరె
వారి మోసగించు బధిరాంధులను మించి?
అమ్మనాన్నలన్న నవనిసురలు.

 

162. సమస్య:  “కోడిమాంసమ్ము హితము యోగులకు దినగ”

 

(నిత్యమాంసాహారి మాటలు)

అనుదినమ్మును మాంసము నాబతోడ
దినెడి వాగుడుకాయయె తిక్కమీరి
తనదు లఘుదృష్టి నలుగడ దనర బలికె
“కోడిమాంసమ్ము హితము యోగులకు దినగ”.

 

163. సమస్య:  “భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెన్గునన్”

 

(పాండవుల కృష్ణభక్తిని తెలిపే భగవత్కథ భారతాన్ని నన్నయ వెలయించాడు)

బాగుగ రాజసూయమును భవ్యము జేయుచు భక్తి రంజిలన్,
వేగమె యర్ఘ్యపాత్ర గొని వెన్కనె చైద్యుని నీసడించుచు
న్నేగురు తమ్ములున్ వినయమేర్పడ కృష్ణుని సేవ సల్పగన్
భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెన్గునన్.

 

164. సమస్య:  “పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్”

 

(విద్వాంసులు మెచ్చని యతుకుల పద్యరచన పాపమే)

సద్యోహృద్యము; బుధజన
విద్యోదంచితసుమధురవిహరణధీనై
వేద్యమ్ము కాని యతుకుల
పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్.

165. సమస్య:  “దుఃఖ మెఱిగిన వానికే తుష్టి కలుగు”

 

(శ్రామికుల బాధ తెలిస్తేనే తృప్తి)

పవలు రేయియు కష్టించు బడుగువారి,
రాలు రప్పలు దున్నెడి రైతుజనుల,
గనుల బనిచేసి మండెడి కనులవారి,
దుఃఖ మెఱిగిన వానికే తుష్టి కలుగు.

 

166. సమస్య:  “తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్”

 

(దాహం తీర్చేది కవితామృతమే)

వర్షపునీటి నెంతగనొ పట్టుచు పోడిమి ద్రాగుచుండినన్;
ఆర్షపు ధర్మవీరమును హాయిగ నాబగ గ్రోలుచుండినన్;
తర్షము దీరలేదు గద! ద్రాక్షరసమ్మును ద్రాగి చూచినన్;
హర్షము మీర దెన్గుకవితాసుధ దప్పిక దీర్చివైచెలే
!

 

167. సమస్య:  “మాన్యుడు గానివాడు సభ మన్ననలందె నదేమి చిత్రమో”

 

(మేకలకాపరి కాలుడు కవికులతిలకుడు కాళిదాసు కావటం ఎంత చిత్రం)

వన్యములైన కాయలను పాలను చక్కగ నారగించుచున్,
జన్యములైన మానసికచంచలరీతు లవెన్నొ నుండగా,
ధన్యుడయెన్ మహాకవిగ ధారుణి కాలుడు కాళిదాసుడై;
మాన్యుడు గానివాడు సభ మన్ననలందె నదేమి చిత్రమో
!

 

168. సమస్య:  “చోరుడె పూజ్యుడాయె గద చోద్యముగాగ నిలాతలంబునన్”

 

(శ్రీనివాసుడు తస్కరించినా పూజనీయుడే)

వేరని యెంచకుండ నలివేణుల యుల్లము కొల్లగొట్టుగా;
పారెడి ప్రేమతో వకుళమాలిక మాలికలెల్ల దాల్చుగా;
మీరిన కోర్కె నన్నమయ మెండగు గీతుల మూటగట్టుగా;
చోరుడె పూజ్యుడాయె గద చోద్యముగాగ నిలాతలంబునన్!

169. సమస్య:  “నాస్తికుడు హరితత్వము నమ్మి మురిసె”

 

(విష్ణుద్వేషియైన హిరణ్యకశిపుడు చివరకు విష్ణుతత్వం తెలుసుకున్నాడు)

హరిని యరిగానె తలపోసి యరయలేడు;
ఆత్మజుని మాట ప్రహ్లాద మందలేడు;
దరినె నరసింహు దర్శించి దైత్యరాజు;
నాస్తికుడు; హరితత్వము నమ్మి మురిసె.

 

170. సమస్య:  “రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు”

 

 (దశరథుడు రాముని కరుణించమని పరశురామునితో)
చతురఘనకీర్తి! శితికంఠఛాత్రమూర్తి!

శమితదుర్గర్వరాజేంద్రశత్రుహారి!

జ్వలితజమదగ్నిపుత్రక! జయము! ప్రణత

రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు.

 

171. సమస్య:  “భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావనరామమూర్తికిన్”

 

(శ్రీరామ కల్యాణం – మాతృత్రయ నీరాజనం)

ఆర్యుడు; సూర్యవంశమున నంచితతేజుడు; పొంగులెత్తు నౌ
దార్యమహాగుణుండు; భరతాదుల గూరిమి యన్నగారు నౌ
శౌర్యరసావతారుడగు చల్లనిస్వామికి గోసలాధిపున్
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావనరామమూర్తికిన్
.

 

172. సమస్య:  “రణమే యవధానమందు రహి మంగళమౌ”

 

(అవధానంలో అగ్రగణ్యమైనది ధారణ)

రణమే గుణమగు; హృదయ హ
రణమే ప్రతిభకు నలదును రక్తిన్; సుప్రే
రణమే బలమిడు; సభ ధా
రణమే యవధానమందు రహి మంగళమౌ
.

173. సమస్య:  “పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పగ గారణం బగున్”

 

(పలనాటి యుద్ధానికి కారకురాలైన నాగమ్మ నిర్వాకం)

తడయక నాగమాంబ తన దానము, సామము, భేదసృష్టితో

గడగడలాడజేసి ప్రజ, గమ్యము గానని మత్సరమ్ముతో,

నొడయని కోడిపందెముల నూహకు నందని మాయజేసెలే;

పడతియె శాంతిసౌఖ్యముల భంగమొనర్పగ గారణంబగున్.

 

174. సమస్య:  “కవి తలలో లేని తలపు కైతల కెక్కెన్”

 

(జగ్గకవికి రాజు మీద కోపం వచ్చి “చంద్రరేఖా విలాసం” “చంద్రరేఖావిలాపం” అయింది)

చవి మీరన్ జగ్గడనెడి

కవి చంద్రరేఖ పయి కృతి కమ్రపురీతి

న్నవముగ వ్రాసియు, నలుగగ

గవి తలలో లేని తలపు కైతల కెక్కెన్.

 

175. సమస్య:  “సర్వజ్ఞుండైనవాడు చంద్రుడె సుమ్మీ”

 

(మౌర్యవంశస్థాపకుడైన చంద్రగుప్తమహావీరుడు)

సర్వసమర్థుడు; మౌర్యుడు;

శర్వుని భక్తుడు; చతురుడు; చంద్రాహ్వయుడున్;

గర్వితశాత్రవఖర్వుడు;

సర్వజ్ఞుండైనవాడు చంద్రుడు సుమ్మీ!

 

176. సమస్య:  “సంహరింతును జగమున శాంతి నిలుప”

 

(అర్జునునితో శ్రీకృష్ణుడు)

వినుము బీభత్స! రథమును వేగ నడపి

చెల్లి కింతటి పాటుల జేసినట్టి

దుర్మదాంధుల చేష్టల దూలగొట్టి

సంహరింతును జగమున శాంతి నిలుప.

177. సమస్య:  “ఖరపథంబు సౌఖ్యకారకంబు”

 

(శాంతంగా తనపని తానుచేసే సేవామూర్తి గాడిద)

కనుల నగవు లొలుకు; గాంచును శమముతో;

ఇంత గడ్డి తిన్న నెంతొ మురియు;

చీకు చింత లేని చిన్నారి గాడిద;

ఖరపథంబు సౌఖ్యకారకంబు.

 

178. సమస్య:  “ధారణ లేనివాడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్”

 

(వాగ్దేవి దయతో భయాన్ని రానీయని అవధాని కీర్తిమంతుడు)

ధీరతతోడ తెల్లనగు దేవి సరస్వతి పాదపద్మముల్

ప్రేరణ గొల్పగా దలచి ప్రేంఖణవేగము వెల్లువెత్తగా,

చారణులెల్ల మెచ్చులిడ శ్రావ్యపురీతులు సందడింప, భీ

ధారణ లేనివాడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్.

 

179. సమస్య:  “బైబిలు బరికించి వ్రాసె భాగవతమ్మున్”

 

(కృష్ణుని క్రీస్తుని లీలల మనోదర్శనంతో పోతన భాగవతరచన సాగిందని భావన)

శోభగ కృష్ణుని క్రీస్తుని

శ్రీభగవల్లీలల దన చిన్మయదృష్టి

న్నా బమ్మెరకవి మదిలో

బైబిలు బరికించి, వ్రాసె భాగవతమ్మున్.

 

180. సమస్య:  “కీచకు డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్”

 

(కీచకుడు-బృహన్నల)

నీచపుకోర్కెలో మునిగి నిర్మలమూర్తిని ద్రౌపదీసతిన్

మేచకవేళలన్ మితులు మీరిన భీమునిచేత చచ్చులే

కీచకుడైన; సద్గురువు కీర్తిగడించు ధరిత్రిలోపలన్

సేచనుడై బృహన్నలగ జెల్వుగ నుత్తరరాకుమారిచే.

181. సమస్య:  “దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు”

 

(పక్కింటి పడతులను చూసి పడే పరితాపమే వనితలకు సంతోషకారకం)

ఎడమ యింటను జేరిన ఈశ్వరమ్మ,

కుడిన కొలువున్న కోర్కెల కుముదవల్లి,

నడుమ దర్పాల దమయంతి నరసి పొందు

దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు.

 

182. సమస్య:  “బూతు పురాణముం జదువ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్”

 

(సాహిత్యచరిత్రలో 1700 - 1875 వరకు గల క్షీణయుగ కవుల పలుకులు)

ఆతతమైన ప్రజ్ఞ నణువంతయు జూపక భోగలాలసన్

నేతల మెప్పులందగను నీమము దప్పుచు తిక్కగ్రంథముల్

చేతులకొద్ది వ్రాయుచును క్షీణకవీంద్రులు పల్కిరిట్టులన్

“బూతుపురాణముం జదువ బుణ్యము దక్కుట తథ్య మీభువిన్”.

 

183. సమస్య:  “హనుమంతుడు పెండ్లియాడె నద్రితనూజన్”

 

(శివపార్వతుల పరిణయం)

అనుపమకాంతుడు; శర్వుడు;

ధనదాంతఃకరణచరుడు; దర్పకదాహుం;

డనవద్యుడు; శివుడు; ప్రణత

హనుమంతుడు; పెండ్లియాడె నద్రితనూజన్.

 

184. సమస్య:  “లక్ష్మణు బెండ్లాడె సీత రాగాన్వితయై”

 

(దాశరథుల కల్యాణం)

పక్ష్మముల వాల్చి యూర్మిళ

లక్ష్మణు బెండ్లాడె; సీత రాగాన్వితయై

సూక్ష్మమతి రాము; మాండవి

పక్ష్మలహృదు భరతుని; శ్రుతభామ చతుర్ధున్.

185. సమస్య:  “అల్లా రామునకు పుత్రు డయ్యా శాస్త్రీ”

 

(జానకిని జననిగా తలచిన మారుతి రామునికి పుత్రుడేగా)

ఉల్లోలపు కడలి గడచి

తల్లిగ సీతమ్మ దలచి; తల్లోలుండౌ

ముల్లోకవీర హనుమయె

అల్లా, రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ!

 

186. సమస్య:  “తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్”

 

(రోగం, స్వార్థం, దుర్భావం జనంలో లేని దినమే శుభదినం)

ఎద్దిన మందునన్ బ్రజల నేవిధి రుగ్మత క్రుంగదీయదో,

ఎద్దిన మందునన్ మతుల నింతయు స్వార్థము స్వారిచేయదో,

ఎద్దిన మందునన్ మదుల నేహ్యపుటూహలు సందడింపవో.

తద్దినమే శుభంబులిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్.

 

187. సమస్య:  “దుర్మార్గము గాదు గురుల దూషించినచో”

 

(తెలిసి తప్పుచేసిన గురువు నిందార్హుడు)

ధర్మం బెరిగిన ద్రోణు డ

ధర్మంబుగ నడవిబిడ్డ తరుణాంగుటమున్

మర్మపు దక్షిణ నడిగెను;

దుర్మార్గము గాదు గురుల దూషించినచో.

 

188. సమస్య:  “కాటుకగా ధరించె గద కంజదళాయతనేత్రి కారమున్”

 

(మహిషాసురుని ఎదిరించే కాళికను గాంచిన పరమేశ్వరుడు)

చేటుల చేతలన్ జగతి జీల్చెడి యమ్మహిషాసురాధమున్

వేటును వేయగా నరుగు వెల్గుల యెఱ్ఱని కాళి కన్నులన్

గాటపు ప్రేమతో గనిన కాంతుడు శంకరుడెంచె నిట్టులన్

“కాటుకగా ధరించె గద! కంజదళాయతనేత్రి కారమున్”.

189. సమస్య:  “అక్కరో యిటు రాగదే యని యాలి బిల్చెను భర్తయే”

 

(ఆలుమగల కలహాల నాపమంటున్న అత్తమామలతో, అక్కబావలతో కుటుంబరావు)

“ఎక్కసక్కెపు మాటలాడకు మింకచాలును అత్తరో!

ముక్కచెక్కలు కాములే యిక ముద్దుగుందుము మామరో!

చక్కగుందుము బుద్ధివచ్చెను చల్లగుందుము బావరో!

అక్కరో!” “యిటు రాగదే” యని యాలిబిల్చెను భర్తయే.

 

190. సమస్య:  “సంకటముల గూర్చువాడు సంకర్షణుడే”

 

(దైహిక మానసిక స్థైర్యంకోసం కష్టాలు కలిగించేది బలరాముడే)

జంకక దుష్టుల డీకొన,

శంకల స్వాంతన మెపుడును సాంత్వన జెంద,

న్వంకలు లేని విధంబున

సంకటముల గూర్చువాడు సంకర్షణుడే.

 

191. సమస్య:  తెలుగును నేర్చుకొమ్మనుట తేలిక నేర్చినగొల్వు లిత్తురే.

 

(ఉద్యోగం చేయటం యంత్రజీవితం – తెలుగు చదవటం ఆర్ద్రజీవితం)
“తెలుగును నేర్చుకొమ్మనుట తేలిక; నేర్చిన గొల్వు లిత్తురే ?
కలవర మేలనయ్య కడు కమ్మని భాషను నేర్చుకొంటకున్;
మెలకువ పెంచుకొంటకును; మేలగు జ్ఞానము నందుకొంటకున్;
గొలువది యంత్రజీవనము; కూరిమి తెల్గది యార్ద్ర జీవమే.

 

192. సమస్య:  “మీసములన్ గనంగగలమే యిక మేదిని నెందుగాంచినన్”

 

(సహస్రావధాన సార్వభౌములు మేడసాని, మాడుగుల, గరికిపాటి)

సేసలు జల్లగన్ సభల జిత్రపు కైతల మోహనార్యుడా!

మోసులువారు భావముల ముద్దగు నాగఫణీంద్రశర్ముడా!

బాసలు వానలై కురియు బంగరుపల్కుల నారసింహుడా!

మీ-సములన్ గనంగగలమే యిక మేదిని నెందుగాంచినన్?

 

193. సమస్య:  “అనృతమ్ముల బల్కువాడె యారాధ్యుండౌ”

 

(“అశ్వత్ధామ హతః” అన్న ధర్మరాజు పూజనీయుడు)

ఘనమగు సమరము నడుమన

గొనకొని ధర్మజుడరిగెను గురువరు కడకు;

న్ననువగు నసత్య మాడెను;

ననృతమ్ముల బల్కువాడె యారాధ్యుండౌ.

 

194. సమస్య:  “దారముపైన వ్రాలెనుగదా మకరందము గ్రోల దుమ్మెదల్”

 

(శివతపోవనం – మన్మథప్రవేశం)

దారను వెంటబెట్టుకొని దర్పకుడంతట శైలజామనో

హారుని భక్తహృద్వనవిహారుని ధ్యానవనంబు జేరగా

మీరిన నుత్సుకత్వమున మేలగు గీతుల నాలపించి మం

దారముపైన వ్రాలెనుగదా మకరందము గ్రోల దుమ్మెదల్.

 

195. సమస్య:  “అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో”

 

(రాణి పద్మావతి ఆత్మార్పణం)

ఘనుడగు మేవాడ్ రతనుని

మనసుమగువ పద్మకు ఖలమతి యల్లా యు

ద్దినుఖిల్జి మదము నణప,

న్ననలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో.

 

196. సమస్య:  “శారదయే బలిగొనె గద జను లెందరినో”

 

(శారదానది వరదల కల్లోలం)

జోరుగ బంటల నొసగుచు

శారదపేరున బరగెడి శాంతపు నదికిన్

వారధి ధ్వంసము కాగా

శారదయే బలిగొనెగద జనులెందరినో!

197. సమస్య:  “ఎంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే”

 

(ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజి ఆంధ్రులకు ఆకాశకుసుమాలు)

ఎంతయొ యిత్తురంచు మరి యెన్నియొ యూహల నూగుచుంటిమే!

అంతయు సున్నచుట్టితిరి యాశలు శూన్యములయ్యె నయ్యయో!

వింతగ నాటలాడితిరి; విహ్వలురన్ మము మోడి! కావవే?

ఎంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే?

 

198. సమస్య:  “దుష్ట సుయోధనున్ వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్”

 

(భానుమతి దుఃఖం – ద్రౌపది సౌఖ్యం)

నష్టమునెంతయో బడసె నర్మిలి భానుమతీలలామయే

దుష్టసుయోధనున్ వలచి; ద్రోవది పెండిలియాడె వేడుకన్

శిష్టపవిత్రవర్తనుల; జెల్వగు మూర్తుల; బాండు పుత్రులన్

ధృష్టుడు సోదరుండు; కడు ధీరుడు; ద్రష్టగ వెంట నిల్వగా.

 

199. సమస్య:  “రాముని పుత్రు డర్జునుడు రావణు గెల్చె రణాంగణమ్మునన్”

 

(రావణాసురుని జయించిన కృతవీర్య పుత్రుడు కార్తవీర్యార్జునుడు)

సేమము చిందులాడ ఘనసీమను హైహయరాజ్యమున్ మహా

ధీమతి; దోర్బలుండు; రణధీరుడు; నిర్మలు డేలుచుండగా

వేమరు చెప్పనేల! కృతవీర్యుని నార్తజనైకరక్షణా

రాముని పుత్రు డర్జునుడు రావణు గెల్చె రణాంగణమ్మునన్.

 

200. సమస్య:  “పతి సరసములాడగ సతి పరువులు వెట్టెన్”

 

(మాద్రిని తిలకించి మునిశాపం మరచిన పాండురాజు)

శతశృంగపు గిరి మీదను,

మతి దప్పిన పాండువిభుడు మదనుడు వేచన్,

మృతి మరచుచు మాద్రి గనియె;

పతి సరసములాడగ సతి పరువులు వెట్టెన్!

201. సమస్య:  “పుత్రోత్సాహమ్ము పొంగు బోగాలమునన్”

 

(ఘటోత్కచుని యుద్ధనైపుణ్యం – భీమసేనుని పారవశ్యం)

పిత్రానుక్రమశౌర్యము

చిత్రముగ ఘటోత్కచునకు జెందన్ భీము

న్నేత్రముల మోదఝరులవె;

పుత్రోత్సాహమ్ము పొంగు బోగాలమునన్.

 

202.  సమస్య:  “లెక్కయె యెక్కువైనపుడు లేదుగదా సుఖమెంతమాత్రమున్”

 

(అధికసంతానం అనర్ధదాయకం)

అక్కర దాటుచుండ మరి యైదుగురార్గురు బిడ్డలేలొకో?

చెక్కిటచేయి జేర్చుచును చింతలువంతలు పొందనేటికో?

ముక్కున వేలు నుంచుకొని మూగగ నందరు వెక్కిరింపరే?

లెక్కయె యెక్కువైనపుడు లేదుగదా! సుఖమెంతమాత్రమున్.

 

203. సమస్య:  “రా రమ్మని పిల్చె సీత రాధాలోలున్”

 

(సీతాదేవి రాముని, మీరాదేవి కృష్ణుని పిలిచారు)

ఆరామంబున రాముని

“రా ర”మ్మని పిల్చె సీత; రాధాలోలున్

గారామున కనపడమని

మీరయె తంబుర శ్రుతులను మీటుచు పిలిచెన్.

 

204. సమస్య:  “జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే”

 

(నాయకుల వెనుక తిరిగే పరాన్నభుక్కులు)

నేతల కిష్టమైన నికనిండుగ వాసము గ్రాసమేర్పడున్;

మోతలు మోగునట్లు తమ ముద్దగు నాయకు మోయవచ్చులే;

శ్రోతల కర్ణముల్ పగుల స్తోత్రపు కేకలు వేయవచ్చులే;

జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే!

205. సమస్య:  “సంసారికి లేని చింత సన్యాసికగున్”

 

(రామకృష్ణుడు - వివేకానందుడు)

హింసాధూర్తుల దాడికి

ధ్వంసంబై పోవుచున్న ధరణిన్ గావన్

సంసిద్ధుండు నరేంద్రుడు;

సంసారికి లేని చింత సన్యాసికగున్.

 

206. సమస్య:  “నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్”

 

(శ్రీకృష్ణనింద చేసిన సత్రాజిత్తు తరువాత సత్యం తెలిసి ప్రశంసించాడు)

“పొందగు నా సహోదరుడు ముద్దుప్రసేనుని సంహరింతువా?

కుందనమిచ్చు నా మణిని కుత్సిత బుద్ధిని దస్కరింతువా?

చందములింక జెల్ల” వని చక్రిని బల్కిన సత్యతండ్రియే

నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్.

 

207. సమస్య:  “పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లిని జూడ వేడుకన్”

 

(భీష్ముని పేరుగల యువకుని పెళ్లి)

ఎన్నగ భారతమ్మునను నెన్నియొ పాత్రలు చేరియుండినన్

మన్నికకెక్కి మానసపు మందిరమందున భీష్ముడుంటచే

గన్నకుమారు నామమిడె కాంతయ; యుద్వహనంబు వానికిన్;

బిన్నలు పెద్ద రేగిరట భీష్మునిపెండ్లిని జూడ వేడుకన్.

 

208. సమస్య:  “నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్”

 

(సమస్యాపూరణ వల్ల మనసుకు ఉపశమనం)

నృత్యము సేయుచు నుండు న

సత్యపుటూహల మనమది సంరంభమునన్;

స్మృత్యములగుటకు చేష్టలు

నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి